నటితో వివాహేతర సంబంధం.. మాజీ మంత్రి అరెస్ట్.. సంచలన విషయాలు వెలుగులోకి..!

ABN , First Publish Date - 2021-06-21T19:13:38+05:30 IST

ఓ నటితో వివాహేతర సంబంధం నడిపి మోసగించారన్న ఆరోపణతో...

నటితో వివాహేతర సంబంధం.. మాజీ మంత్రి అరెస్ట్.. సంచలన విషయాలు వెలుగులోకి..!

  • మాజీ మంత్రి మణికంఠన్‌ అరెస్టు 
  • బెంగుళూరులో అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • కోర్టులో హాజరు,  జైలుకు తరలింపు

చెన్నై/అడయార్‌ : ఓ నటితో వివాహేతర సంబంధం నడిపి మోసగించారన్న ఆరోపణతో తప్పించుకు తిరుగుతున్న అన్నాడీఎంకే నేత, మాజీ మంత్రి మణికంఠన్‌ కటకటాలపాలయ్యారు. ఓ సినీ నటి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనను చెన్నై నగర పోలీసులు అరెస్టు చేశారు. బెంగుళూరులో ఉన్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడకు వెళ్ళి అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. తరువాత వైద్య పరీక్షలు నిర్వహించి జైలుకు తరలించారు.  గత కొన్ని రోజులుగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగిన మణికంఠన్‌ ఎట్టకేలకు ఆదివారం పోలీసుల చేతికి చిక్కారు. తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ఓ నటి గత నెల 28వ తేదీన చెన్నై నగర పోలీసు కమిషనరు కార్యాలయంలో మాజీ మంత్రి మణికంఠన్‌ పై లైంగిక ఆరోపణల ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె ఆరు పేజీలతో కూడిన ఫిర్యాదును అందజేశారు.


సంచలన విషయాలు...

ఇందులో ఆమె అనేక సంచలన విషయాలను వెల్లడించారు. పెళ్ళిపేరుతో ఐదేళ్ళపాటు సహజీవనం చేసిన మణికంఠన్‌.. రెండుసార్లు బలవంతంగా గర్భస్రావం చేయించారని, ఈ విషయం బయటకు చెబితే తన ప్రైవేట్‌ ఫొటోలను సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేస్తానంటూ బెదిరించారని పేర్కొన్నారు. ముఖ్యంగా కిరాయి ముఠాతో హత్య చేయించేందుకు కుట్ర పన్నారంటూ ఆరోపించారు. దీన్ని పరిశీలించిన నగర పోలీస్‌ కమిషనర్‌ అడయార్‌ మహిళా పోలీస్‌స్టేషన్‌ పోలీసులను విచారణకు ఆదేశించారు. దీంతో రంగం లోకి దిగిన పోలీసులు.. మణికంఠన్‌పై ఆరు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వీటిలో ఐపీసీ 313 (నిర్బంధ గర్భస్రావం), 323 (కొట్టి గాయపరచడం), 417 (నమ్మకద్రోహం), 376 (లైంగికంగా హింసించడం), 506 (1) (హత్యా బెదిరింపులు), 67(ఏ) (సమాచార సాంకేతికతను దుర్వినియోగం చేయడం) వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దీంతో ఆయన అరెస్టు ఖాయమని తేలిపోవడంతో ముందస్తు బెయిల్‌ కోరుతూ మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. దీన్ని విచారణకు స్వీకరిం చిన కోర్టు గత 16వ తేదీని తిరస్కరించింది. దీంతో మణికంఠన్‌ను అరెస్టు చేసేందుకు రెండు ప్రత్యేక పోలీసు బృందాలు విస్తృతంగా గాలించాయి.


బెంగుళూరులోని స్నేహితుడి ఫామ్‌హౌస్‌లో...

మణికంఠన్‌ బెంగుళూరులోని తన స్నేహితుడికి చెందిన ఫామ్‌హౌస్‌లో దాగివున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో శనివారం రాత్రి బెంగుళూరు వెళ్ళిన ప్రత్యేక పోలీసు బృందం అతడిని అదుపులోకి తీసుకుని ప్రత్యేక వాహనంలో నగరానికి తీసుకొచ్చి ఆదివారం మధ్యాహ్నం కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. అయితే, బెంగుళూరు నుంచి చెన్నై తీసుకొచ్చే క్రమంలో సినీనటి సమర్పించిన ఫొటోలు, వీడియో ఆధారాలను చూపించి అతడిని విచారించారు. ఈ సందర్భంగా ఆయన వాంగ్మూలాన్ని పోలీసులు వీడియో రికార్డు చేశారు.


సినీనటితో పరిచయం ఇలా...

గత అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో మణికంఠన్‌ రాష్ట్ర సమాచార, ప్రచార శాఖామంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో ఆ నటి మలేసియా ఎంబసీలో పనిచేస్తుండగా, మణికంఠన్‌కు దగ్గరైంది. అంతకుముందు ఈమె ఒకటి రెండు సినిమాల్లో కూడా నటించారు. మణికంఠన్‌తో సహజీవనం  తర్వాత సినిమాలకు స్వస్తి చెప్పారు. మణికంఠన్‌ పెళ్ళి చేసుకుంటానని హామీ ఇవ్వడంతో ఆమె పూర్తిగా ఆయనతో కలిసి ఒకే ఇంట్లో ఉండేది. ఈ క్రమంలోనే రెండుసార్లు గర్భస్రావం కూడా చేయించుకున్నారు. చివరకు పెళ్లి చేసుకోకుండా మోసగించారంటూ ఆమె పోలీసులను ఆశ్రయించడంతో ఇంతకాలం గుట్టుగా ఉన్న ఈ వ్యవహారం బహిర్గతమైంది.

Updated Date - 2021-06-21T19:13:38+05:30 IST