అవమానం జరిగింది, మోదీ నన్ను మాట్లాడనివ్వలేదు : మమత బెనర్జీ

ABN , First Publish Date - 2021-05-20T19:52:52+05:30 IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీరును పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి

అవమానం జరిగింది, మోదీ నన్ను మాట్లాడనివ్వలేదు : మమత బెనర్జీ

కోల్‌కతా : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీరును పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ తీవ్రంగా తప్పుబట్టారు. కోవిడ్-19 పరిస్థితిపై గురువారం జరిగిన సమావేశంలో ఇతరులు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదని, తన గౌరవానికి భంగం జరిగిందని, తాను అవమానానికి గురయ్యానని ఆరోపించారు. 10 రాష్ట్రాల్లోని జిల్లాల కలెక్టర్లతో మోదీ సమావేశం అనంతరం మమత బెనర్జీ మీడియాతో మాట్లాడారు. 


మమత బెనర్జీ మీడియాతో మాట్లాడుతూ, ఈ సమావేశానికి ముఖ్యమంత్రులను కూడా పిలిచారని, అయితే వారితో మోదీ మాట్లాడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ముఖ్యమంత్రులను పిలిచిన తర్వాత ఆయన మాతో మాట్లాడకపోవడం చాలా దురదృష్టకరం. మమ్మల్ని మాట్లాడనివ్వలేదు’’ అని మమత ఆరోపించారు. కేవలం కొందరు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మోదీ మాత్రమే కాసేపు ప్రసంగించారని, ఆ తర్వాత సమావేశాన్ని ముగించేశారని చెప్పారు. ఇది సాధారణ సమావేశమన్నారు. 


‘‘మేం అవమానానికి గురయ్యామనే భావిస్తున్నాం. వ్యాక్సిన్ల గురించి కానీ, రెమ్‌డెసివిర్ గురించి కానీ ఆయన (మోదీ) మమ్మల్ని అడగలేదు. బ్లాక్ ఫంగస్ కేసుల గురించి అడగలేదు’’ అని మమత పేర్కొన్నారు. బెంగాల్‌లో వ్యాక్సిన్ల కొరత ఉందనే విషయాన్ని లేవనెత్తాలనుకున్నానని, మరిన్ని వ్యాక్సిన్ డోసులను సరఫరా చేయాలని కోరాలని అనుకున్నానని తెలిపారు. కానీ తమను మాట్లాడనివ్వలేదని చెప్పారు. 


కోవిడ్-19 కేసులు తగ్గుముఖం పడుతున్నాయని మోదీ ఈ సమావేశంలో చెప్పారన్నారు. ఆయన గతంలో కూడా ఇదేవిధంగా చెప్పారని గుర్తు చేశారు. ఆయన మాటలతో కేసులు మరింత పెరిగాయన్నారు. ‘‘మోదీ ఎంత అభద్రతాభావంలో ఉన్నారంటే, ఆయన మా మాట కనీసం వినలేదు’’ అని చెప్పారు. 


Updated Date - 2021-05-20T19:52:52+05:30 IST