కశ్మీర్‌లో భయం భయం
ABN , First Publish Date - 2021-10-20T07:55:15+05:30 IST
జమ్మూకశ్మీర్‌లో స్థానికేతరులను ఉగ్రవాదుల భయం వెంటాడుతోంది. ఎప్పుడు, ఎక్కడ ఉగ్రవాదులు తమను చంపేస్తారేమోనని వలసదారులు దినదిన గండంగా బతుకుతున్నారు.

స్వస్థలాలకు స్థానికేతరుల పయనం
జమ్మూ/ఢిల్లీ, అక్టోబరు 19: జమ్మూకశ్మీర్‌లో స్థానికేతరులను ఉగ్రవాదుల భయం వెంటాడుతోంది. ఎప్పుడు, ఎక్కడ ఉగ్రవాదులు తమను చంపేస్తారేమోనని వలసదారులు దినదిన గండంగా బతుకుతున్నారు. గత రెండు వారాల్లోనే 11 మంది వలసదారులను ముష్కరులు కాల్చి చంపేశారు. దీంతో చాలా మంది ఇప్పటికే ప్రాణభయంతో స్వస్థలాలకు తిరుగు పయనం అవుతున్నారు. ‘‘క్రికెట్ బ్యాట్లను తయారుచేసే పరిశ్రమలో నేను పనిచేస్తాను. గత కొన్నేళ్లుగా ఇక్కడే జీవనోపాధి పొందుతున్నాను. సాధారణంగా నా బంధువులు, స్నేహితుల కోసం అప్పుడప్పుడు బ్యాట్లను తీసుకెళ్లి కానుకగా ఇస్తుంటాను. ఓ స్నేహితుడి కుమారుడి కోసమని ఓ బ్యాట్ తయారు చేశాను. ఇక ఇదే నా చివరి కానుక అవుతుంది. ఉపాధి కోసం మళ్లీ కశ్మీర్‌కు వెళ్లను’’ అని ఛత్తీ్‌సగఢ్‌కు చెందిన మింటూ సింగ్ అనే వలస కార్మికుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనలాగే కొన్ని వందల మంది వలస కార్మికులు స్వస్థలాల బాట పట్టారు. గత కొద్ది వారాల్లోనే కశ్మీర్ భయానకంగా మారిందని, రోజూ నరకం చూస్తున్నామని వారు వాపోతున్నారు. తమ భార్య, పిల్లలతో కలిసి రాత్రికిరాత్రే పుల్వామా తదితర జిల్లాలను వదిలి జమ్మూ రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు.
అయితే ప్రస్తుత హింసాయుత వాతావరణాన్ని అవకాశంగా తీసుకుని వలస కార్మికులకు కొంతమంది యజమానులు జీతాలు చెల్లించడం లేదు. కొంతమందిని బలవంతంగా వెళ్లగొడుతున్నారు. తమ యజమానులు తమకు జీతాలు చెల్లించేలా చూడాలని అధికారులను కార్మికులు వేడుకుంటున్నారు. మరోవైపు కశ్మీర్‌లో మైనారిటీల హత్యలపై జాతీయ దర్యాప్తు సంస్థ దర్యాప్తు చేసే అవకాశం ఉంది. కాగా పూంఛ్, రాజౌరీ జిల్లాల సరిహద్దుల్లో ఉన్న మెంఢార్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదుల ఏరివేత కోసం బలగాలు చేపట్టిన ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇక కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈనెల 24, 25న కశ్మీర్‌లో పర్యటించనున్నారు. ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణే కూడా కశ్మీర్ పర్యటనలో ఉన్నారు.