ఐదు పార్టీల కూటమితో ఎన్నికలకు వెళ్తాం: ఫరూక్ అబ్దుల్లా

ABN , First Publish Date - 2021-12-26T21:15:23+05:30 IST

జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగస్వామ్య పార్టీలతో కలిసి మతతత్వ శక్తులను...

ఐదు పార్టీల కూటమితో ఎన్నికలకు వెళ్తాం: ఫరూక్ అబ్దుల్లా

శ్రీనగర్: జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగస్వామ్య పార్టీలతో కలిసి మతతత్వ శక్తులను ఎదుర్కొంటామని నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా సంకేతాలిచ్చారు. ఐదు పార్టీలతో ఇటీవల ఏర్పాటు చేసిన పీపుల్స్ అలయెన్స్ ఫర్ గుప్కార్ డిక్లరేషన్ (పీఏజీడీ) ఈసారి కలిసికట్టుగా ఎన్నికల్లో పోటీ చేస్తుందని పరోక్షంగా ఆయన పేర్కొన్నారు. పీఏజీడీ చైర్‌పర్సన్‌గా ఫరూక్ ఉన్నారు. 2019 ఆగస్టులో కేంద్రం రద్దు చేసిన జమ్మూకశ్మీర్ ప్రత్యేక హోదాను పునరుద్ధరించాలనే డిమాండ్‌తో ఐదు పార్టీల కూటమిగా పీఏజీడీ ఏర్పడింది. ఇందులో నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ (పీడీపీ), సీపీఎం, అవామీ నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ మూవ్‌మెంట్ భాగస్వామ్య పార్టీలుగా ఉన్నాయి.


కాగా, జమ్మూకశ్మీర్‌లో ప్రస్తుత పరిస్థితిపై ఫరూక్ అబ్దుల్లా పెదవి విరిచారు. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదం పతాక స్థాయిలో ఉన్న 90వ దశకం కంటే ఇప్పటి పరిస్థితి తీవ్రంగా ఉందని అన్నారు. నవీన భారతంలో తమకు చోటు లేదని యువత భావిస్తున్నారని, ఢిల్లీ ప్రభుత్వంపై వారు నమ్మకాన్ని కోల్పోయారని చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా మతతత్వ శక్తులను ఓడించేందుకు అన్ని పార్టీలు కలిసికట్టుగా కూర్చుని చర్చించి నిర్ణయం తీసుకోవడం ఖాయమని చెప్పారు. జమ్మూకశ్మీర్ ప్రజల హక్కులు, ఉనికి కోసం అన్నిపార్టీలను కలుపుకొని వెళ్తామని, ఇటీవల తామంతా కలిసి సమావేశం ఏర్పాటు చేసి డీలిమిటేషన్ కమిషన్ సిఫారసులను ఏకగ్రీవంగా ఖండించామని చెప్పారు. జమ్మూకు అదనంగా 6, కశ్మీర్‌కు ఒక సీటు కేటాయించాలంటూ ఇటీవల నియోజకవర్గాల పునర్వవస్థీకరణ కమిషన్ కేంద్రానికి సిఫారసు చేసింది.

Updated Date - 2021-12-26T21:15:23+05:30 IST