ఇది రైతుల విజయం: గెలుపు అనంతరం చౌతాలా
ABN , First Publish Date - 2021-11-02T22:52:00+05:30 IST
అయితే ఈ స్థానం నుంచి మళ్లీ చౌతాలానే విజయం సాధించారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గోవింగ్ కాండపై 6,000 ఓట్ల మెజారిటీతో ఆయన విజయం సాధించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..
చండీగఢ్: తాజాగా జరిగిన ఉప ఎన్నికల్లో హర్యానాలోని ఎల్లెనాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నిక ప్రత్యేకమైనది. ఈ ప్రత్యేకత ఏంటంటే.. ఈ స్థానానికి ఉప ఎన్నికల జరగడానికి కారణం మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతోన్న రైతుల ఆందోళన. ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ అభయ్ చౌతాలా, రైతుల ఆందోళనకు మద్దతుగా రాజీనామా చేశారు. దేశంలో సుదీర్ఘ కాలంగా కొనసాగుతోన్న రైతుల ఆందోళన వల్ల ఒక నియోజకవర్గానికి ఉప ఎన్నిక రావడం విశేషమే అని అంటున్నారు.
అయితే ఈ స్థానం నుంచి మళ్లీ చౌతాలానే విజయం సాధించారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గోవింగ్ కాండపై 6,000 ఓట్ల మెజారిటీతో ఆయన విజయం సాధించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘‘ఈ విజయం నాది కాదు.. ఇది రైతుల విజయం’’ అని అన్నారు. ఇంకా మాట్లాడుతూ ‘‘ముఖ్యమంత్రి ఖట్టర్ రాజీనామా చేయాలి. రైతు ఆందోళనకు ప్రజల పూర్తి మద్దతు ఉందని ఈ ఎన్నికతో తేలి పోయింది. ఎలాంటి అవకతవకలు చేయకుండా భారీ మెజారిటీతో నేను గెలిచాను. మీరు అధికార యంత్రాంగాన్ని విచ్చలవిడిగా ఉపయోగించుకున్నారు, ఎన్నికల్లో భారీగా డబ్బులు పంచారు. ఇదంతా నేను నా కళ్లతో చూశాను. కానీ ప్రజలు రైతుల వైపు నిల్చున్నారు’’ అని అభయ్ చౌతాలా అన్నారు.