రైతుల నిరసనలు : వీడియోలపై ఢిల్లీ పోలీసుల దర్యాప్తు

ABN , First Publish Date - 2021-02-07T01:08:22+05:30 IST

కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రైతులకు

రైతుల నిరసనలు : వీడియోలపై ఢిల్లీ పోలీసుల దర్యాప్తు

న్యూఢిల్లీ : కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రైతులకు మద్దతుగా విదేశాల నుంచి అప్‌లోడ్ చేసిన వీడియోలను ఢిల్లీ పోలీసులు విశ్లేషిస్తున్నారు. వీటిని సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్ చేసినవారిని, వారికి సమన్వయకర్తలుగా మన దేశంలో పని చేస్తున్నవారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. శుక్రవారం దాదాపు 50 మంది అనుమానితుల ఫొటోలను విడుదల చేశారు. వీరిని అరెస్టు చేయడానికి తగిన సమాచారం ఇచ్చేవారికి పారితోషికం ఇస్తామని కూడా ప్రకటించారు. 


ఢిల్లీ పోలీస్ ప్రజా సంబంధాల అధికారి చిన్మయ్ బిశ్వాల్ శనివారం మాట్లాడుతూ, రైతుల అంశంపై విదేశాల నుంచి సామాజిక మాధ్యమాల్లో వీడియోలను పోస్ట్ చేసినవారి వివరాలను సేకరించేందుకు సైబర్ సెల్ ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. అత్యాధునిక ఫోరెన్సిక్ సాఫ్ట్‌వేర్ సహాయంతో ఈ విశ్లేషణ జరుగుతున్నట్లు తెలిపారు. శుక్రవారం 50 మంది ఫొటోలను విడుదల చేశామని, వీరిని గుర్తించేందుకు సమాచారం ఇచ్చేవారికి పారితోషికం చెల్లిస్తామని తెలిపారు. అభ్యంతరకరమైన వీడియోలన్నిటినీ పరిశీలిస్తామన్నారు. నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తామన్నారు. 


గ్రెటా థన్‌బర్గ్, మరికొందరు ట్వీట్ చేసిన టూల్‌కిట్ క్రియేటర్లకు సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్లు, ఈ-మెయిల్ ఐడీలు, యూఆర్ఎల్స్‌ తెలియజేయాలని ఢిల్లీ పోలీసులు శుక్రవారం గూగుల్ సహా కొన్ని సోషల్ మీడియా సంస్థలకు లేఖలు రాశారు. భారత ప్రభుత్వంపై సాంఘిక, సాంస్కృతిక, ఆర్థిక యుద్ధాన్ని ప్రకటించినందుకు ఖలిస్థాన్ అనుకూలవాదులపై ఢిల్లీ పోలీస్ సైబర్ సెల్ కేసు నమోదు చేసింది. గ్రెటా షేర్ చేసిన టూల్‌కిట్ క్రియేటర్లు ఖలిస్థాన్ అనుకూలవాదులని ఆరోపిస్తూ ఈ కేసు నమోదైంది. 


ఈ టూల్‌కిట్‌ను ఖలిస్థాన్ అనుకూల సంస్థ అయిన పొయిటిక్ జస్టిస్ ఫౌండేషన్ రూపొందించినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. జనవరి 26న, అంతకు ముందు వివిధ హ్యాష్‌ట్యాగ్స్‌తో డిజిటల్ స్ట్రైక్ చేయాలని ఈ టూల్‌కిట్‌లో ఉన్నట్లు తెలిసింది. ట్వీట్ల తుపాను సృష్టిస్తూ, ఇండియన్ ఎంబసీల వద్ద, అదానీ, అంబానీ కార్పొరేట్ కార్యాలయాల వద్ద జనవరి 26న నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని దీనిలో ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.  భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని కూడగట్టడంతోపాటు, వివిధ సాంఘిక, మతపరమైన, సాంస్కృతిక వర్గాల మధ్య అశాంతిని సృష్టించడం పొయిటిక్ జస్టిస్ ఫౌండేషన్ లక్ష్యమని ఈ టూల్‌కిట్ ద్వారా తెలిసిందని చెప్తున్నారు. 



Updated Date - 2021-02-07T01:08:22+05:30 IST