ఢిల్లీ: విషం మింగిన మరో రైతు... ఆసుపత్రిలో మృతి!
ABN , First Publish Date - 2021-01-20T16:43:45+05:30 IST
నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో రైతులు ఆందోళన చేస్తున్న విషయం విదితమే.

న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో రైతులు ఆందోళన చేస్తున్న విషయం విదితమే. ఈ నేపధ్యంలో మరో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. టికరీ బోర్డర్ వద్ద విషం తీసుకున్న ఒక రైతు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడిని రోహతక్ నివాసి జయభగవాన్(42)గా గుర్తించారు.
కొంతకాలంగా జయభగవాన్ టికరీ బోర్డర్ వద్ద జరుగుతున్న రైతుల ఆందోళనల్లో పాల్గొంటున్నాడు. ఈ నేపధ్యంలో మంగళవారం సాయంత్రం విషం మింగాడు. అతని పరిస్థితిని గమనించిన తోటి ఆందోళనకారులు బాధితుడిని వెంటనే అంబులెన్స్‌లో సంజయ్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి వెళ్లేముందు ఆ రైతు తన తోటి రైతులతో మాట్లాడుతూ తాను రెండు నెలలుగా ఇక్కడే ఉంటూ ఆందోళనల్లో పాల్గొంటున్నానని, ప్రభుత్వం రైతుల మొర పట్టించుకోవడం లేదని వాపోయారు. అందుకే తాను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగివస్తుందని నమ్ముతున్నానని అన్నారు. ఈ విధంగా మాట్లాడుతూనే ఆ రైతు వాంతులు చేసుకున్నాడు. అతనిని గమనించిన రైతులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రైతు మృతి చెందాడు.