ఇంటికొకరు!

ABN , First Publish Date - 2021-02-05T09:03:10+05:30 IST

వచ్చే శని. ఆదివారాల్లో ఢిల్లీ సరిహద్దుల్లోనూ, ఉత్తరాది రాష్ట్రాల్లోనూ రైతుల ఆందోళన ఉధృతం కానుంది. ఘాజీపూర్‌ సరిహద్దుకు ప్రతి ఇంటి నుంచి ఒక్క రైతునైనా పంపాలని

ఇంటికొకరు!

వారాంతంలో రైతు ఆందోళన ఉధృతం

ఘాజీపూర్‌లో పెరుగుతున్న జన ప్రవాహం

ఎంపీల బృందాన్ని అడ్డుకున్న పోలీసులు

శాంతియుత ఆందోళనలు సహజం: అమెరికా

ఈ దేశంలో రైతులు అంతర్భాగం: విరాట్‌ కోహ్లీ

దేశప్రగతి వెనక అన్నదాతలు

గత పాలకులవన్నీ ఓటుబ్యాంక్‌ బడ్జెట్లే: మోదీ

వారాంతంలో రైతు ఆందోళన ఉధృతం

6న హైవేల జామ్‌కు నిర్ణయం


న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): వచ్చే శని. ఆదివారాల్లో ఢిల్లీ సరిహద్దుల్లోనూ, ఉత్తరాది రాష్ట్రాల్లోనూ రైతుల ఆందోళన ఉధృతం కానుంది. ఘాజీపూర్‌ సరిహద్దుకు ప్రతి ఇంటి నుంచి ఒక్క రైతునైనా పంపాలని  పశ్చిమ యూపీలోని వివిధ జిల్లాల్లో జరిగిన ఖాప్‌ పంచాయతీలు తీర్మానించడంలో వారాంతంలో ఘాజీపూర్‌కు జన ప్రవాహం పెరగనున్నదని రైతు నేతలు చెబుతున్నారు. గుంపులు గుంపులుగా వస్తే పోలీసులు బారికేడ్లతో అడ్డుకుంటున్నారని, అందువల్ల ఘాజీపూర్‌ కు ఏ విధంగానైనా చేరుకునేందుకు వ్యూహరచన చేస్తున్నామని భారతీయ కిసాన్‌ యూనియన్‌ నేత ఒకరు చెప్పారు. పోలీసు బలగాలను మరో రెండు వారాల పాటు సరిహద్దుల్లోనే కొనసాగించాలని కేంద్రం నిర్ణయించింది.


గడ్డ కట్టేలా చలి, సన్నని జల్లులు, మంచుగాలులతో వేల మంది ఘాజీపూర్‌ రైతులు బుధవారంరాత్రి ఇబ్బందులు పడ్డారు. టార్పాలిన్‌లతో ఏర్పాటు చేసిన టెంట్ల చాటున గడిపారు. సర్వత్రా విమర్శలు రావడంతో ఇనుప ముళ్ల కంచెలు, మేకుల ఉచ్చులను బుధవారం అర్థరాత్రి దాటాక  కొంతమేర తొలగించారు. శనివారం నాడు  దేశ వ్యాప్తంగా మూడు గంటలపాటు చక్కా జామ్‌ (రాస్తా రోకో) నిర్వహించాలని తీసుకున్న నిర్ణయం మేరకు సింఘూ సరిహద్దులో రైతులు గురువారం ఏర్పాట్లను సమీక్షించారు. అటు- సింఘూ వద్ద ఉన్న కార్యాలయాన్ని మార్చే ఉద్దేశంలో రైతు నేతలు ఉన్నారు. హిందూస్థాన్‌ స్టీల్‌ కంపెనీ ఆవరణను తమ ఆఫీసుగా మార్చుకుని నేతలు తరుచూ ఆంతరింగక సమావేశాల కోసం వాడుకుంటున్నారు. అయితే అనేకమంది నేతలపై ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేయడంతో దాడులు జరగొచ్చని, పోలీసు చర్య అనివార్యం కావొచ్చని నేతలు ఆందోళన చెందుతున్నారు. మరో వైపు షామ్లీలో రాష్ట్రీయ లోక్‌ దళ్‌ నిర్వహించనున్న మహాపంచాయత్‌కు అనుమతించేది లేదని పోలీసులు ప్రకటించగా, ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ పంచాయత్‌ను నిర్వహిస్తామని లోక్‌దళ్‌ నేత జయంతి చౌదరి స్పష్టంచేశారు..రైతులకు మంచినీరు, మందులు అందకుండా అడ్డుకుంటున్నారని, దీనిపై చర్య తీసుకోవాలని కోరుతూ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ మానవహక్కుల  సంస్థలో ఓ పిటిషన్‌ వేసింది. 


గ్రెటా టూల్‌కిట్‌ సృష్టికర్తలపైనే ఎఫ్‌ఐఆర్‌!

స్వీడిష్‌ పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్‌పై ఢిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేసినట్లు రోజంతా మీడియాలో ప్రచారం జరిగింది. రైతుల ఆందోళన వెనుక అంతర్జాతీయ కుట్ర ఉందని పేర్కొంటూ దీన్ని నమోదు చేశారని, ఎఫ్‌ఐఆర్‌లో ఆమె పేరును కూడా చేర్చారని సాగింది. అయితే ఢిల్లీ పోలీసులు దీనిపై వివరణ ఇస్తూ ఆమెపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు నిజం కాదని స్పష్టం చేశారు. రైతు ఆందోళనకు మద్దతిచ్చేందుకు వీలుగా ఆమె రెండ్రోజుల కిందట ఓ టూల్‌కిట్‌ను షేర్‌ చేశారు. జనవరి 26న ఢిల్లీ పరిణామాలపై రైతులకు మద్దతిచ్చే సమాచారం కూడా కిట్‌లో ఉంది. రైతుల ఆందోళనకు అమెరికా రగ్బీ లీగ్‌లోనిఇద్దరు పెద్ద ఆటగాళ్లు- మద్దతు ప్రకటించారు. వీరిలో జూజూ స్మిత్‌ అనే స్టార్‌ ఆటగాడు 10వేల డాలర్ల సాయాన్ని కూడా రైతులకు ప్రకటించాడు. రైతులను ఉగ్రవాదులుగా అభివర్ణిస్తూ బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ చేసిన ట్వీట్‌ను ట్విటర్‌ తొలగించింది. అదే విధంగా రైతు ఆందోళనలు ఈ దేశానికి పట్టిన కేన్సర్‌ అని పెట్టిన ట్వీట్‌ను కూడా డిలీట్‌ చేసింది. 


బీజేపీ- కాంగ్రెస్‌ వార్‌

అంతర్జాతీయ సెలబ్రిటీలు ట్వీట్లు చేయడంపై బీజేపీకి చెందిన తారలు మండిపడుతున్నారు. ఇండియా గురించి తెలియని వాళ్లు మాట్లాడడమేంటని ఎంపీ హేమమాలిని, వాస్తవాలు తెలుసుకుని స్పందించాలని ఖుష్బూ సుందర్‌ అన్నారు. గ్రెటా ఒట్టి పిల్లకాకి అని ఎంంపీ మీనాక్షి లేఖి అన్నారు. సెలిబ్రిటీల ట్వీట్లు దేశానికి ఇబ్బందికరంగా మారాయని ఎంపీ శశిథరూర్‌ అభిప్రాయపడ్డారు. విదేశాంగ శాఖ ప్రకటనను చిదంబరం తప్పుబట్టారు. 


టీమ్‌ మీటింగ్‌లో చర్చ: కోహ్లీ

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ  తన స్పందనను తెలియపర్చారు. ఈ ఆందోళన గురించి జట్టు సమావేశాంలో స్వల్ప చర్చ జరిగిందని ఆయన వెల్లడించారు. అయితే ఎవరేమన్నారన్నది చెప్పలేదు. ఎవరి వైఖరి వారు వెల్లడించారన్నారు.
ప్రియాంక పరామర్శ

రిపబ్లిక్‌ డే నాడు ఐటీవో వద్ద ట్రాక్టర్‌ తిరగబడి చనిపోయిన నవ్రీత్‌సింగ్‌ కుటుంబాన్ని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకవాద్రా గురువారం రాంపూర్‌లోని స్వగ్రామానికి వెళ్లి పరామర్శించారు. నవ్రీత్‌కు శ్రద్ధాంజలి ఘటించారు. ‘నా కొడుకు వయసు20.. మీ అబ్బాయికి (నవ్రీత్‌కు)25 ఏళ్లు... బాధను నేను అర్థం చేసుకోగలను. మీ అబ్బాయి త్యాగం వృథా కాదు. ఒక తప్పును సహించడం కూడా తప్పు అని భావించి నవ్రీత్‌ ఢిల్లీ వెళ్లాడు. పేదలు, రైతుల బాధను వినలేని, చూడలేని నేతల వల్ల ఈ దేశానికి ఉపయోగం లేదు’ అని ఆమె అన్నారు.

Updated Date - 2021-02-05T09:03:10+05:30 IST