రైతులను రెచ్చగొడుతున్నారు : కేంద్ర మంత్రి

ABN , First Publish Date - 2021-02-05T19:42:35+05:30 IST

కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు

రైతులను రెచ్చగొడుతున్నారు : కేంద్ర మంత్రి

న్యూఢిల్లీ : కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు కేవలం ఒక రాష్ట్రానికే పరిమితమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ చెప్పారు. ఈ చట్టాల్లో ఎటువంటి సమస్యలు లేవని చెప్తూ, రైతులను కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని చెప్పారు. 


నరేంద్ర సింగ్ తోమర్ శుక్రవారం రాజ్యసభలో మాట్లాడుతూ, ప్రతిపక్షాలకు ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్‌ సహా ప్రతిపక్షాలు కొత్త సాగు చట్టాలపై చర్చిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ చట్టాలను నల్ల చట్టాలు అని అభివర్ణించినందుకు  మండిపడ్డారు. ఈ చట్టాలు నల్ల చట్టాలు ఎలా అయ్యాయో చెప్పాలని రైతు సంఘాలను తాను కోరుతున్నానన్నారు. కానీ ఎవరూ తనకు వివరంగా చెప్పలేదన్నారు. ఈ చట్టాలు అమల్లోకి వస్తే రైతుల భూములను ఇతరులు ఆక్రమించుకుంటారని రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. కాంట్రాక్ట్ ఫార్మింగ్ చట్టంలోని నిబంధనల్లో కనీసం ఒక నిబంధన అయినా రైతుల భూమిని వ్యాపారులు లాక్కొనేందుకు అవకాశం కల్పిస్తోందా? అలాంటి నిబంధన ఈ చట్టంలో ఉంటే చూపించండి? అని నిలదీశారు. రైతులను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. 


రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలని, జీడీపీలో వ్యవసాయ రంగం వాటా వేగంగా పెరగాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు.  ఉత్పాదక వ్యయం కన్నా 50 శాతం ఎక్కువగా ఎంఎస్‌పీని ఇవ్వడం ప్రారంభించామన్నారు. స్వయం సమృద్ధ భారత్ పథకం క్రింద వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధిని రూ.1 లక్ష కోట్లతో ఏర్పాటు చేశామన్నారు. వ్యవసాయ రంగానికి అవసరమైన పెట్టుబడులను సమకూర్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ కృషిలో చాలా ముఖ్యమైన చర్య కొత్త సాగు చట్టాలని తెలిపారు. 


Updated Date - 2021-02-05T19:42:35+05:30 IST