ప్రభుత్వ ప్రతిపాదనలపై చర్చించాం : రైతు సంఘాలు

ABN , First Publish Date - 2021-12-08T01:16:17+05:30 IST

ప్రభుత్వ ప్రతిపాదనలపై చర్చించినట్లు సంయుక్త కిసాన్

ప్రభుత్వ ప్రతిపాదనలపై చర్చించాం : రైతు సంఘాలు

న్యూఢిల్లీ : ప్రభుత్వ ప్రతిపాదనలపై చర్చించినట్లు సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కేఎం) నేతలు మంగళవారం తెలిపారు. కొన్ని అంశాలపై వివరణ కోరామని, రైతులపై పెట్టిన బూటకపు కేసులను ఉపసంహరించాలని కోరామని తెలిపారు. దాదాపు 40 రైతు సంఘాలతో కూడిన ఈ మోర్చా సమావేశం మంగళవారం జరిగింది. తదుపరి సమావేశం బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు జరుగుతుందని రైతు నేతలు చెప్పారు.  


రైతు సంఘం నేత బల్బీర్ సింగ్ రాజేవాల్ మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వం తమకు ఓ ప్రతిపాదన పంపించిందని చెప్పారు. దీనిపై సంయుక్త కిసాన్ మోర్చాలోని నేతలందరూ చర్చించినట్లు తెలిపారు. కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)పై చట్టబద్ధమైన హామీ కోసం డిమాండ్‌ను పరిశీలించేందుకు కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెప్పిందన్నారు. తమ మోర్చాలో లేని రైతు సంఘాలను, ప్రభుత్వాధికారులను, రాష్ట్రాల ప్రతినిధులను కూడా ఈ కమిటీలో చేర్చుతామని చెప్పిందన్నారు. దీనిపై తాము అభ్యంతరం తెలిపామని చెప్పారు. ప్రారంభం నుంచి తమ డిమాండ్లకు వ్యతిరేకంగా ఉన్నవారికి ఈ కమిటీలో స్థానం ఉండకూడదన్నారు. దీనిపై మరింత స్పష్టత ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. రైతులపై పెట్టిన బూటకపు కేసుల ఉప సంహరణ కోసం నిరసనను ఉపసంహరించాలని కేంద్రం కోరిందన్నారు. దీనిని కూడా తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. 


Updated Date - 2021-12-08T01:16:17+05:30 IST