భారతరత్నాలపై దర్యాప్తా? విచక్షణ వదిలేశారా?: బీజేపీ

ABN , First Publish Date - 2021-02-08T23:25:50+05:30 IST

రైతు ఆందోళనలపై బాలీవుడ్, క్రికెట్ సెలబ్రెటీల ట్వీట్ల వ్యవహారం ముదురుతున్నట్టే..

భారతరత్నాలపై దర్యాప్తా? విచక్షణ వదిలేశారా?: బీజేపీ

ముంబై: రైతు ఆందోళనలపై బాలీవుడ్, క్రికెట్ సెలబ్రెటీల ట్వీట్ల వ్యవహారం ముదురుతున్నట్టే కనిపిస్తోంది. సెలబ్రెటీలంతా ఏకకాలంలో, ఒకే తరహాలో ట్వీట్లు చేయడం వెనుక బీజేపీ హస్తం ఉందంటూ కాంగ్రెస్ చేసిన ఫిర్యాదుతో మహారాష్ట్ర సర్కార్ సోమవారంనాడు దర్యాప్తునకు ఆదేశించడం సంచలనం కాగా, మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై రాష్ట్ర బీజేపీ నిప్పులు చెరిగింది. మహారాష్ట్ర గౌరవం ఎక్కడికి పోయిందంటూ ఎద్దేవా చేసింది.


మహా వికాస్ అఘాడి సర్కార్ నిర్ణయంపై బీజేపీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ విచారం వ్యక్తం చేశారు. 'ఇది ఎంతో చింతించాల్సిన విషయం. మీరు ఎప్పుడూ చెప్పే మరాఠీల గౌరవం మాట ఇప్పుడు ఎక్కడికి పోయింది? మహారాష్ట్ర ధర్మం ఏమైపోయింది? యావద్దేశంలోనే ఇలాంటి రత్నాలు (జెమ్స్) లేరు. దేశానికి దన్నుగా ఎప్పుడూ ఏకగళం వినిపించే భారతరత్నాలపైనా మీరు దర్యాప్తునకు ఆదేశించేది?. మహా వికాస్ అఘాడి ప్రభుత్వం విచక్షణ కోల్పోయిందా?' అని ఫడ్నవిస్ ఆ ట్వీట్‌లో ప్రశ్నించారు.


ఇలా మొదలైంది..

సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రెండున్నర నెలలుగా ఆందోళనలు సాగిస్తున్న రైతులకు అంతర్జాతీయ పాప్ స్టార్ రెహన్నా, క్లయిమేట్ యాక్టివిస్ట్ గ్రెటా థున్‌బెర్గ్ మద్దతు ప్రకటిస్తూ ట్వీట్లు చేయడం దుమారం రేపింది. దీనిపై భారత విదేశాంగ శాఖ ఘాటుగా స్పందించింది. ఆ వెంటనే ఐక్యతా పిలుపునిస్తూ సచిన్ టెండూల్కర్, అక్షయ్ కుమార్, సునీల్ షెట్టి, లతా మంగేష్కర్ సహా పలువురు సెలబ్రెటీలు ట్వీట్ చేశారు. అయితే, సెలబ్రెటీలంతా ఏకకాలంలో, ఒకే తరహా ట్వీట్లు చేయడం వెనుక బీజేపీ స్కిఫ్టు ఉందని కాంగ్రెస్ ఫిర్యాదు చేయడంతో మహారాష్ట్ర సర్కార్ దర్యాప్తునకు ఆదేశించింది.

Updated Date - 2021-02-08T23:25:50+05:30 IST