కొవిడ్ ప్రోటోకాల్ ఉల్లంఘించారంటూ ముఖ్యమంత్రిపై కేసు

ABN , First Publish Date - 2021-05-19T02:45:31+05:30 IST

కొవిడ్-19 ప్రోటోకాల్, ట్రిపుల్ లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించారంటూ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సహా పలువురు ఎల్డీఎఫ్...

కొవిడ్ ప్రోటోకాల్ ఉల్లంఘించారంటూ ముఖ్యమంత్రిపై కేసు

తిరువనంతపురం: కొవిడ్-19 ప్రోటోకాల్, ట్రిపుల్ లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించారంటూ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సహా పలువురు ఎల్డీఎఫ్ నేతలపై కేంద్ర మాజీ మంత్రి, కేరళ కాంగ్రెస్ సీనియర్ నేత పీసీ థామస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తిరువనంతపురంలోని కంటోన్మెంట్ పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టిన థామస్... విజయన్, మరో 22 మంది ఇతర నేతలు ఏకేజీ సెంటర్‌లో ‘‘అక్రమంగా’’ సమావేశం అయ్యారని ఆరోపించారు. ఓ వైపు జిల్లా మొత్తం ట్రిపుల్ లాక్‌డౌన్‌లో ఉండగా కేక్ కట్ చేసి కనీసం భౌతిక దూరం నిబంధనలు కూడా పాటించకుండా అసెంబ్లీ ఎన్నికల విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారని ఆయన పేర్కొన్నారు. వీరి చర్యలు కేరళ అంటు వ్యాధుల నివారణ చట్టంతో పాటు ఐపీసీలోని పలు సెక్షన్ల కింద శిక్షార్హమైన నేరమన్నారు. మరోవైపు విజయన్‌తో పాటు ఈ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యేలు, మంత్రులు రాజ్యాంగంలోని మూడవ షెడ్యూల్ కింద చేసిన ప్రమాణాన్ని కూడా ఉల్లంఘించారనీ.. కాబట్టి అలాంటి పదవుల్లో కొనసాగకుండా వారిని అనర్హులుగా ప్రకటించాలని థామస్ డిమాండ్ చేశారు. ‘‘ముఖ్యమంత్రి తన రోజువారీ మీడియా సమావేశాల్లో కరోనా వ్యాప్తిని నివారించేందుకు కొవిడ్ ప్రోటోకాల్ పాటించాలని తరచూ చెబుతుంటారు. అదే వ్యక్తి ఇప్పుడు అన్ని మార్గదర్శకాలను ఉల్లంఘించారు. టీవీల్లో వచ్చిన విజువల్స్ దీనికి ప్రత్యక్ష సాక్ష్యం..’’ అని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనపై విచారణ జరిపించి, తగిన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను కోరారు. 

Updated Date - 2021-05-19T02:45:31+05:30 IST