కాబూల్ నుంచి ఖాళీ విమానంలో భార్యను తరలించిన మాజీ కమాండో.. వైరల్ అవుతున్న ఫొటోలు

ABN , First Publish Date - 2021-08-21T02:15:24+05:30 IST

ఆఫ్ఘన్ నుంచి బయటపడేందుకు కాబూల్ విమానాశ్రయానికి ఇటీవల వేలాదిమంది పోటెత్తారు. విమానం రెక్కలపైన కూర్చుని

కాబూల్ నుంచి ఖాళీ విమానంలో భార్యను తరలించిన మాజీ కమాండో.. వైరల్ అవుతున్న ఫొటోలు

కాబూల్: ఆఫ్ఘన్ నుంచి బయటపడేందుకు కాబూల్ విమానాశ్రయానికి ఇటీవల వేలాదిమంది పోటెత్తారు. విమానం రెక్కలపైన కూర్చుని అయినా దేశం దాటాలని ప్రయత్నించి ఇద్దరు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. పోటెత్తిన జనాన్ని అడ్డుకునేందుకు జరిపిన కాల్పుల్లో మరికొందరు బయలుదేరారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాను ముంచెత్తాయి. ఇప్పటికీ వేలాదిమంది విమానాశ్రయం బయట ప్రతి రోజూ పడిగాపులు కాస్తున్నారు. 


ఓవైపు పరిస్థితి ఇలా ఉంటే రాయల్ మెరైన్‌కు చెందిన యూకే మాజీ కామాండో పాల్ ‘పెన్’ ఫార్తింగ్ తన భార్య కైసా‌ను దేశం ఖాళీ విమానంలో తరలించిన ఫొటోలు సోషల్ మీడియాను చుట్టేస్తున్నారు. స్వయంగా ఆయనే ఈ ఫొటోలను షేర్ చేయడం గమనార్హం. ఆమె ప్రయాణించిన ‘సి-11 గ్లోబ్‌మాస్టర్’ మిలటరీ రవాణా విమానం దాదాపు ఖాళీగా ఉంది.


ఫొటోను ట్వీట్ చేసిన ఆయన ఎయిర్‌పోర్టు బయట వేలాది మంది లోపలికి రాలేక నలిగిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విమానం నిండినా, నిండకున్నా ప్రతీ గంటకు టేకాఫ్ అవాల్సిందేనని పేర్కొన్నారు. దురదృష్టవశాత్తు మిషన్ పూర్తయ్యాక వీరిని విడిచిపెట్టి వెళ్లిపోవాల్సి ఉంటుందని అన్నారు. త్వరలో చాలా భయంకరమైన సన్నివేశాలు చూడాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. పాశ్చాత్య ప్రభుత్వాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన పాల్.. కాబూల్‌ల పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని అన్నారు.   


ఇటీవల అమెరికా కార్గో విమానంలో 640 మంది ఆఫ్ఘన్లు కిక్కిరిసి కూర్చుని దేశం దాటుతున్న ఫొటోలు వైరల్ అయ్యాయి. ప్రజలు దేశం నుంచి బయటపడేందుకు తంటాలు పడుతున్న వేళ వారిని తప్పించుకునేందుకు పాల్ జంట విమానంలో రాత్రిపూట ఒంటరిగా వెళ్లడం విమర్శలకు తావిచ్చింది.


ఇది చాలా దురదృష్టకరమని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని నెటిజన్లు మండిపడుతున్నారు. పెన్‌పై చర్యలు తీసుకోవాలని మరికొందరు డిమాండ్ చేస్తుండగా, ఆయన ఎందుకలా వెళ్లాల్సి వచ్చిందో నిజమైన కారణం చెప్పగలరా? అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు.

Updated Date - 2021-08-21T02:15:24+05:30 IST