వర్షాలతో ప్రజలు అట్టుడికిపోతుంటే.. శంఖాలు ఊదుతున్నారా..?

ABN , First Publish Date - 2021-11-21T17:41:14+05:30 IST

భారీ వర్షాలు, వరదలతో ప్రజలు అట్టుడికిపోతుంటే బీజేపీ నే తలు శంఖాలు ఊదుతూ ఎన్నికల రాజకీయాలు చేస్తున్నారని ప్రతిపక్షాలు విరుచుకుపడ్డాయి. శాసనసభలో ప్రతిపక్షనేత సిద్దరామయ్య బెంగళూరులో

వర్షాలతో ప్రజలు అట్టుడికిపోతుంటే.. శంఖాలు ఊదుతున్నారా..?

              - Bjp నేతలపై మాజీ సీఎంలు సిద్దూ, కుమార ధ్వజం


బెంగళూరు: భారీ వర్షాలు, వరదలతో ప్రజలు అట్టుడికిపోతుంటే బీజేపీ నే తలు శంఖాలు ఊదుతూ ఎన్నికల రాజకీయాలు చేస్తున్నారని ప్రతిపక్షాలు విరుచుకుపడ్డాయి. శాసనసభలో ప్రతిపక్షనేత సిద్దరామయ్య బెంగళూరులో శనివారం మీడియాతో మాట్లాడుతూ భారీ వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా పరిస్థితి భయానకంగా ఉందన్నారు. లక్షలాది ఎకరాల పంట నీటిపాలైందన్నారు. తక్షణ సహాయ కార్యక్రమాలు చేపట్టాల్సిన తరుణంలో సీఎం, మంత్రులు జన స్వరాజ్‌ యాత్రలో శంఖాలు ఊదుతూ బిజీగా ఉన్నారని ఎద్దేవా చేశారు. రోమ్‌ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించినట్టుగా ప్రభుత్వ తీరు ఉందని మండిపడ్డారు. ప్రభుత్వానికి, మంత్రులకు మధ్య సమన్వయం పూర్తిగా లోపించిందన్నారు. భారీ వర్షాల దెబ్బకు ప్రజలు హాహాకారాలు చేస్తుంటే మంత్రులు పట్టించుకోవడం లేదని, అధికారులు నిద్రావస్థలో ఉన్నారని విరుచుకుపడ్డారు. ఇకనైనా నిద్రమత్తు వదిలి వర్షపీడిత ప్రాంతాలలో పర్యటించాలని ఆయన ముఖ్యమంత్రిని కోరారు. ప్రజల్లో పీకల్లోతు కష్టాల్లో ఉన్నా ప్రభుత్వం స్పందించని తీరును ఆయన ఎండగట్టారు. కాగా జేడీఎస్‌ నేత మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కూడా ప్రభుత్వతీరుపై విరుచుకుపడ్డారు. భారీ వర్షాలు, వరదలతో దాదాపు పది జిల్లాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదన్నారు. బీజేపీ నేతలకు రాజకీయాలే ముఖ్యమని, ప్రజల బాగోగులు పట్టవన్నారు. ముఖ్యమంత్రి బొమ్మై తూతూ మంత్రంగా జిల్లా అధికారులతో వీడియో సదస్సు నిర్వహించి చేతులుదులుపుకున్నారన్నారు. రెవెన్యూశాఖ మంత్రి అశోక్‌ బెంగళూరులో కూర్చుని ఉత్తుత్తి ప్రకటనలు చేస్తున్నారన్నారు. రైతుల వారసుడినని చెప్పుకొనే మాజీ సీఎం యడియూరప్ప కూడా కల్లబొల్లి కబుర్లకే పరిమితయ్యారన్నారు. నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని, ఇళ్లు కోల్పోయినవారిని ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2021-11-21T17:41:14+05:30 IST