దేశం పరువు తీయవద్దు: కంగనపై బీజేపీ ప్రతినిధి ఫైర్

ABN , First Publish Date - 2021-11-17T21:18:12+05:30 IST

జాతిపిత మహాత్మాగాంధీని పరిహసిస్తూ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలను..

దేశం పరువు తీయవద్దు: కంగనపై బీజేపీ ప్రతినిధి ఫైర్

న్యూఢిల్లీ: జాతిపిత మహాత్మాగాంధీని పరిహసిస్తూ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఢిల్లీ ప్రతినిధి నిఘత్ అబ్బాస్ తప్పుపట్టారు. గాంధీజీ బోధనలతో స్ఫూర్తి పొందిన వారిలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఉన్నారని, గాంధీకి వ్యతిరేకంగా చేసే ప్రకటనల వల్ల అంతర్జాతీయ స్థాయిలో దేశం పరువు పోతుందని అన్నారు. ''మహాత్మాగాంధీకి దేశ ప్రజలే జాతిపిత హోదా ఇచ్చారు. ఆయన ఆలోచనలను బీజేపీ సజీవంగా నిలుపుతోంది. ఆయన ఆలోచనలు మన ప్రధాని నరేంద్ర మోదీకి సైతం స్ఫూర్తిగా నిలిచాయి''అని ఆమె అన్నారు. ఈ మేరకు ఒక వీడియోను ట్విట్టర్ టైమ్‌లైన్‌లో నిఘత్ అబ్బాస్ షేర్ చేశారు.


''గాంధీ గురించి అసంబద్ధమైన విషయాలను మాట్లాడటం ద్వారా కంగనా ఏమి కోరుకుంటుందో తెలుసుకోవాలనుకుంటున్నాను. స్వాతంత్ర్య పోరాటంపై రోజువారీ ప్రశ్నలు ఆమె గుప్పిస్తోంది. దేశ ప్రజల మనోభావాలను గాయపరుస్తోంది. ఆమె కేవలం దేశ ప్రజల మనోభావాలను గాయపరచడమే గాకుండా దేశ ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయిలో దిగజారుస్తోంది'' అని నిఘత్ అబ్బాస్ అన్నారు. గాంధీజీ జాతిపిత అని, ఎప్పటికీ జాతిపితగానే ఉంటారని, బీజేపీకి కూడా ఆయన స్ఫూర్తి అని పేర్కొన్నారు. దీనికి ముందు, గాంధీజీ 'అహింసా సిద్ధాంతాన్ని' కంగనా రనౌత్ విమర్శిస్తూ, ఒక చెంపమీద కొడితే మరో చెంప చూపించడమనేది ఎలాంటి ఆజాదీ అవుతుందని ప్రశ్నించారు. సుభాష్ చంద్రబోస్, భగత్‌సింగ్‌లకు గాంధీజీ నుంచి ఎలాంటి సపోర్ట్ దక్కలేదని అన్నారు. ''మీ హీరోలను తెలివిగా ఎంచుకోండి'' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌‌లో వరుస పోస్ట్‌లలో వ్యాఖ్యానించారు.

Updated Date - 2021-11-17T21:18:12+05:30 IST