నీ స్ఫూర్తి నచ్చింది.. ఉద్యోగం ఇస్తా!

ABN , First Publish Date - 2021-12-30T07:25:56+05:30 IST

సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా.. ప్రతిభావంతులను ప్రోత్సహిస్తుంటారు. ...

నీ స్ఫూర్తి నచ్చింది.. ఉద్యోగం ఇస్తా!

దివ్యాంగుడికి ఆనంద్‌ మహీంద్రా ఆఫర్‌

న్యూఢిల్లీ, డిసెంబరు 29: సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా.. ప్రతిభావంతులను ప్రోత్సహిస్తుంటారు. తాజాగా ఓ దివ్యాంగుడికి ఉద్యోగం ఇస్తానని ఆయన ప్రామిస్‌ చేశారు. కాళ్లు, చేతులు లేకున్నా.. ఢిల్లీకి చెందిన దివ్యాంగుడు ప్రత్యేకంగా తయారు చేయించుకున్న వాహనాన్ని నడుపుకుంటూ వెళ్తున్నాడు. ఆ సమయంలో ఓ వ్యక్తి ఆయన్ను పలకరించగా.. ‘నాకు భార్య ఇద్దరు చిన్న పిల్లలు, వృద్ధుడైన తండ్రి ఉన్నారు. వారి పోషణ కోసం నేనే సంపాదించాలి’ అని బదులిచ్చారు. సోషల్‌ మీడియాలో ఈ వీడియో చూసిన మహీంద్రా స్పందించారు. ‘ఈ వీడియోలో ఉన్న వ్యక్తి తన వైకల్యాన్ని ఎదుర్కోవడమే కాకుండా.. తనకున్న దానికి ఎంతో కృతజ్ఞతతో ఉన్నాడు. రామ్‌.. లాస్ట్‌ మైల్‌ డెలివరీ కోసం ఆయన్ను బిజినెస్‌ అసోసియేట్‌గా చేయగలరా..’ అని ట్వీట్‌ చేస్తూ.. మహీంద్రా లాజిస్టిక్స్‌ ఎండీ, సీఈవో రామ్‌ప్రవీణ్‌ స్వామినాథన్‌కు ట్యాగ్‌ చేశారు. ‘తప్పకుండా ఆనంద్‌.. ఆయన మన డెలివరీ విభాగానికి ఒక ఆస్తిగా ఉంటాడు’ అని రామ్‌ప్రవీణ్‌ బదులిచ్చారు. మహీంద్రా ట్యాగ్‌చేసిన ఆ వీడియో ఇప్పుడు వైరల్‌ అవుతోంది. 

Updated Date - 2021-12-30T07:25:56+05:30 IST