18న ఢిల్లీకి ఎడప్పాడి.. ఏం జరగబోతోంది..!?

ABN , First Publish Date - 2021-01-13T16:16:27+05:30 IST

అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో బీజేపీకి సీట్లను కేటాయించే

18న ఢిల్లీకి ఎడప్పాడి.. ఏం జరగబోతోంది..!?

చెన్నై : సీఎం ఎడప్పాడి పళనిస్వామి రెండు రోజుల పర్యటన నిమిత్తం ఈనెల 18న ఢిల్లీకి బయలుదేరి వెళుతున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీని కలుసుకుని చెన్నై మెరీనా బీచ్‌లో నిర్మించిన మాజీ ముఖ్యమంత్రి జయలలిత స్మారకస్థలి ప్రారంభోత్సవానికి ఆహ్వానించనున్నారు. అదే సమయంలో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో బీజేపీకి సీట్లను కేటాయించే విషయంపై చర్చలు జరపనున్నారని తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్‌ చివరివారంలో జరిగే అవకాశం వుంది. ఎన్నికల నోటిఫికేషన్‌ను కేంద్ర ఎన్నికల సంఘ ప్రధానాధికారి సునీల్‌ అరోరా మార్చిలో జారీ చేస్తారని చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రధాన పార్టీల నాయకులందరూ ముమ్మరంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. 


మిత్రపక్షం బీజేపీ నాయకులు కూటమి ధర్మాన్ని విస్మరించి  అన్నాడీఎంకేపై అదేపనిగా విమర్శలు చేస్తున్నారు. రెండు పార్టీల విబేధాలు తీవ్రరూపం దాలుస్తున్న సమయంలో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి సీటీ రవి తిరుచ్చిలో మీడియాతో మాట్లాడుతూ... సీఎం అభ్యర్థిపై తుది నిర్ణయం తీసుకునే బాధ్యత అన్నాడీఎంకేకే ఉందంటూ వివాదాలకు ఫుల్‌స్టాప్‌ పెట్టారు. అయితే సీట్ల కేటాయింపుపై బీజేపీ ఉడుంపట్టు ధోరణిని అనుసరిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో తమకు కనీసం 40 నియోజకవర్గాలు కేటాయించాలని కోరుతోంది. ప్రస్తుతం తమ కూటమిలో బీజేపీ కంటే ఓటు బ్యాంకు అధికంగా కలిగిన పీఎంకే, డీఎండీకే లకు తగినన్ని సీట్లను కేటాయించాల్సి ఉంది.


ఇక బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చెన్నైలో ఓ తమిళ పత్రిక వార్షికోత్సవ సభలో, మదురవాయల్‌ సమీపంలో పార్టీ తరఫున జరిగే పొంగల్‌ వేడుకల్లో పాల్గొనేందుకు చెన్నైకి విచ్చేస్తున్నారు. ఆ సమయంలో బీజేపీ రాష్ట్ర శాఖ నాయకులతో ఆయన సమావేశమైన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్ని నియోజకవర్గాలలో పోటీ చేయాలనే విషయంపై సమగ్రంగా చర్చిస్తారని తెలుస్తోంది ఈ పరిస్థితుల్లో ఎడప్పాడి ఢిల్లీకి వెళ్లనుండడం రాజకీయ ప్రాధాన్యాన్ని సంతరించుకోనుంది.  సీఎంతోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి షణ్ముగం తదితర అధికారులు కూడా ఢిల్లీకి వెళుతున్నారు.


జయ సమాధి పరిశీలన

మెరీనా బీచ్‌లోని మాజీ ముఖ్యమంత్రి జయలలిత సమాధి వద్ద స్మారక మందిరం నిర్మాణ పనులను సీఎం ఎడప్పాడి పరిశీలించారు. రూ.79.75 కోట్లతో ఫినిక్స్‌ పక్షిని పోలిన ఆకారంతో ప్రారంభమైన స్మారకమందిర  పనులు తుదిదశకు చేరుకున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందే జయ స్మారక మందిరాన్ని ప్రారంభిం చాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఈ మేరకు  నిర్మాణ పనులను పరిశీలించారు.  మంత్రి డి. జయకుమార్‌, అధికారులు కూడా స్మారక మందిరం పనులను పరిశీలించారు. తొలుత ఎడప్పాడి, మంత్రి జయకుమార్‌ జయ సమాధివద్ద పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు. ఆ తర్వాత స్మారక మందిరం వద్ద రాజమండ్రి నుంచి తెప్పించిన మొక్కలను నాటుతున్న పనులను పరిశీలించారు.

Updated Date - 2021-01-13T16:16:27+05:30 IST