EASE 4.0ను ప్రారంభించిన నిర్మల సీతారామన్

ABN , First Publish Date - 2021-08-25T21:04:20+05:30 IST

క్లీన్, స్మార్ట్ బ్యాంకింగ్‌ను వ్యవస్థీకరించేందుకు ఉద్దేశించిన

EASE 4.0ను ప్రారంభించిన నిర్మల సీతారామన్

న్యూఢిల్లీ : క్లీన్, స్మార్ట్ బ్యాంకింగ్‌ను వ్యవస్థీకరించేందుకు ఉద్దేశించిన సంస్కరణల ఎజెండాను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ బుధవారం ప్రారంభించారు. ఎన్‌హాన్స్‌డ్ యాక్సెస్ అండ్ సర్వీస్ ఎక్సలెన్స్ (EASE 4.0) పేరుతో ఈ ఉమ్మడి సంస్కరణల ఎజెండాను ప్రభుత్వ రంగ బ్యాంకుల కోసం రూపొందించారు. 


ప్రభుత్వ రంగ బ్యాంకుల అధిపతులతో నిర్మల సీతారామన్ బుధవారం ముంబైలో సమావేశమయ్యారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వ రంగ బ్యాంకుల వార్షిక పని తీరును సమీక్షించామని చెప్పారు. స్వయం సమృద్ధ భారత్ ప్యాకేజీ, కోవిడ్-19 సంబంధిత ప్యాకేజీల అమలును సమీక్షించినట్లు తెలిపారు. 


ఉద్దీపన వేగానికి అనుగుణంగా ప్రతి జిల్లాలోనూ రుణ వితరణ కృషిని బ్యాంకులు చేపడతాయని చెప్పారు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో కస్టమర్ల అవసరాలు ఉన్నప్పటికీ, బ్యాంకుల విలీన ప్రక్రియకు ఎటువంటి విఘాతం కలగలేదన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్‌బీ) సమష్టిగా చాలా బాగా పని చేస్తున్నాయన్నారు. మార్కెట్‌కు రాగలమని, నిదులను సేకరించగలమని ఈ బ్యాంకులు నిరూపించాయన్నారు. ఈశాన్య రాష్ట్రాల కోసం ప్రత్యేకంగా ఓ ప్రణాళికను రూపొందించాలని పీఎస్‌బీలను కోరామన్నారు. ఈశాన్య రాష్ట్రాల లాజిస్టిక్స్, ఎగుమతుల అవసరాలను ప్రత్యేకంగా చూడాలన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సూచించినట్లుగా, ఈశాన్య రాష్ట్రాల్లోని ఆర్గానిక్ పండ్ల రంగం డిమాండ్‌కు తగినట్లుగా బ్యాంకులు వ్యవహరించాలన్నారు. ఈశాన్య రాష్ట్రాల ఉత్పత్తులకు మార్కెట్ సదుపాయాల కల్పనపై దృష్టి సారించాలని తెలిపారు. 


‘ఒక జిల్లా-ఒక ఎగుమతి’ ఎజెండాను అమలు చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పని చేయాలని బ్యాంకులను కోరినట్లు తెలిపారు. బిహార్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాల్లో కరంట్ అకౌంట్ సేవింగ్స్ అకౌంట్ (సీఏఎస్ఏ) డిపాజిట్లు పెరిగిపోతున్నాయని చెప్పారు. ఈ ప్రాంతాల్లో వ్యాపారాభివృద్ధికి రుణాలు అందుబాటులో ఉండేలా చూడాలని బ్యాంకులను కోరారు. 


Updated Date - 2021-08-25T21:04:20+05:30 IST