చార్‌ధామ్‌కు డబుల్‌ లేన్‌ రోడ్డు

ABN , First Publish Date - 2021-12-15T06:49:25+05:30 IST

ఉత్తరాఖండ్‌లో వ్యూహాత్మక చార్‌థామ్‌ హైవే ప్రాజక్టును డబు ల్‌ లేన్‌ రోడ్డుగా విస్తరించేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది. ఇటీవల దేశ భద్రతకు తీవ్ర సవాళ్లు ఎదురయ్యాయని వ్యాఖ్యానించింది...

చార్‌ధామ్‌కు డబుల్‌ లేన్‌ రోడ్డు

హైవే విస్తరణ ప్రాజెక్టుకు సుప్రీం అనుమతి

న్యూఢిల్లీ, డెహ్రాడూన్‌, డిసెంబరు 14: ఉత్తరాఖండ్‌లో వ్యూహాత్మక చార్‌థామ్‌ హైవే ప్రాజక్టును డబు ల్‌ లేన్‌ రోడ్డుగా విస్తరించేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది. ఇటీవల దేశ భద్రతకు తీవ్ర సవాళ్లు ఎదురయ్యాయని వ్యాఖ్యానించింది. న్యాయసమీక్షలో సాయుధ దళాలకు మౌలిక సదుపాయాల విషయంలో కోర్టు రెండో అంచనా చేయబోదని జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలో జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ విక్రమ్‌ నాథ్‌ల ధర్మాసనం మంగళవారం స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్టుపై నేరుగా తమకు నివేదిక ఇచ్చేందుకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఏకే సిక్రీ నేతృత్వంలో పర్యవేక్షణ కమిటీని ధర్మాసనం ఏర్పాటు చేసింది. ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా సిటిజన్స్‌ ఫర్‌ గ్రీన్‌ డూన్‌ అనే ఎన్జీవో సంస్థ పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. 900 కిలోమీటర్ల పొడవైన ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.12 వేల కోట్లు. నాలుగు పవిత్ర పట్టణాల(యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్‌, బద్రీనాథ్‌) మధ్య అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ సైన్యం రాకపోకలు సాగించేలా మౌలిక సదుపాయాలు కల్పించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. కాగా, పర్యవేక్షణ కమిటీ తాజాగా పర్యావరణపై అంచనాలు వేయబోదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సాయుధ దళాల రాకపోకలకు అవసరమైన వసతుల కల్పనను నిర్ణయించే అధికారం రక్షణశాఖకు ఉందని స్పష్టం చేసింది. సరిహద్దుల భద్రత దృష్ట్యా డబ్లుల్‌ లేన్‌ రోడ్లు అవసరమని రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది. ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల హిమాలయ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడకుండా చర్యలు తీసుకుంటామని తెలిపింది. కాగా, చార్‌ధామ్‌ యాత్రకు సంబంధించిన పురాతన నడక మార్గాల అన్వేషణ చేపట్టిన నిపుణుల బృందం వాటిలో కనీసం 3 మార్గాలను పునరుద్ధరించేందుకు అవకాశాలు ఉన్నట్టు గుర్తించింది. తెహ్రీ డ్యాం నిర్మాణం తర్వాత దారులు అదృశ్యమయ్యాయని చెప్పారు. 

Updated Date - 2021-12-15T06:49:25+05:30 IST