పరిహారం ఇవ్వొద్దనుకున్నారా?

ABN , First Publish Date - 2021-06-22T06:50:31+05:30 IST

కొవిడ్‌ మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం చెల్లించరాదని ప్రధాని మోదీ

పరిహారం ఇవ్వొద్దనుకున్నారా?

  •  ప్రధాని నేతృత్వంలోని ఎన్డీఎంఏ నిర్ణయించిందా?
  •  4 లక్షల పరిహారంపై కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు


న్యూఢిల్లీ,జూన్‌ 21: కొవిడ్‌ మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం చెల్లించరాదని ప్రధాని మోదీ నేతృత్వంలోని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్డీఎంఏ) నిర్ణయం తీసుకుందా? అని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. విపత్తుల నిర్వహణపై ఆర్థిక సంఘం సిఫారసు లు చట్టప్రకారం పరిహారంపై రూపొందించిన పథకాల కంటే మిన్న కావని స్పష్టం చేసింది. బాధితుల్లో అసంతృప్తిని నివారించేందుకు ఏకరూప పరిహార పథకాన్ని రూపొందించే అంశాన్ని పరిశీలించాలని సూచించింది.కొవిడ్‌ మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున చెల్లించాలంటూ దాఖలైన రెండు వ్యాజ్యాల విచారణ సందర్భంగా జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌, జస్టిస్‌ ఎంఆర్‌ షాల ధర్మాస నం సోమవారం ఈ వ్యాఖ్యలు చేసింది.


కొవి డ్‌ మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం చెల్లించడం సాధ్యం కాదని కేంద్రప్రభుత్వం సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో స్పష్టం చేసిన విషయం తెలిసిందే. కరోనా వైరస్‌ ఒకసారి వచ్చిపోయే విపత్తు కాదని, మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లి స్తే కేంద్ర, రాష్ట్రాల ఖజానాలు ఖాళీ అవుతాయని తెలిపింది.కొవిడ్‌ మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించలేమంటే.. ప్రభుత్వం వద్ద డబ్బు లేదని అర్థం కాదని కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా తెలిపారు.


స్పందించిన ధర్మాసనం.. ‘మీరు చెప్పేది నిజమే. కేంద్ర ప్రభుత్వం వద్ద నిధులు లేవంటే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి’ అని వ్యాఖ్యానించింది. కేంద్ర ప్రభుత్వ అఫిడవిట్‌పై సీనియర్‌ న్యాయవాది ఎస్‌బీ ఉపాధ్యాయ్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. డాక్టర్లకు అమలు చేస్తున్న బీమా పథకాన్ని స్మశాన వాటికల్లో పనిచేస్తున్న వారికి కూడా వర్తింపజేయాలని అభ్యర్థించారు. దీన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని మెహతా తెలిపారు. కాగా, కొవిడ్‌తో చనిపోయిన వారికి ఇచ్చే మరణ ధ్రువీకరణ పత్రాల ప్రక్రియను సరళతరం చేయాలని ధర్మాసనం ఆదేశించింది. ఇప్పటికే ఇచ్చి న సర్టిఫికెట్లలో తప్పులనూ సరిదిద్దితే వారి కుటుంబసభ్యుల సంక్షేమ పథకాలకు ఉపయోగపడతాయని సూచించింది.


‘మానవత్వం నశించి బ్లాక్‌ మార్కెటింగ్‌ జోరుగా నడుస్తుంటే ఏమని చెప్పగలం? మా ప్రాధాన్యం మాత్రం సామాన్యుడికే’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కొవిడ్‌ మృతులకు రాష్ట్రానికోరకంగా పరిహారం చెల్లిస్తున్న విషయాన్నీ ప్రస్తావించింది. ‘కొవిడ్‌ మృతుల కుటుంబాలకు ఒకేరకమైన పరిహారం చెల్లించేలా నిబంధనలు రూపొందించగలరా? ఒక్కోచోట ఒక్కో తీరుగా పరిహారం ఇస్తుంటే బాధిత కుటుంబాల్లో అసంతృప్తి కలుగుతుంది’ అని కోర్టు పేర్కొన్నది. 


Updated Date - 2021-06-22T06:50:31+05:30 IST