అనవసరంగా అరెస్ట్ చేయకండి : సుప్రీంకోర్టు

ABN , First Publish Date - 2021-05-08T20:28:00+05:30 IST

కోవిడ్-19 మహమ్మారి రెండో ప్రభంజనం విజ‌ృంభిస్తుండటంతో జైళ్లను

అనవసరంగా అరెస్ట్ చేయకండి : సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ : కోవిడ్-19 మహమ్మారి రెండో ప్రభంజనం విజ‌ృంభిస్తుండటంతో జైళ్లను ఖాళీ చేయడంపై సుప్రీంకోర్టు దృష్టి సారించింది. ఏడేళ్ళ కన్నా తక్కువ శిక్ష విధించదగిన నేరాల్లో నిందితులను అవసరమైతే తప్ప అరెస్టు చేయరాదని పోలీసులకు తెలిపింది. జైళ్లలో ఉంటున్న ఖైదీలకు అవసరమైన సరైన వైద్య సదుపాయాలను కల్పించాలని జైళ్ళ శాఖ అధికారులను ఆదేశించింది. జైళ్లలో ఖైదీలకు కోవిడ్-19 సోకుతుండటంపై దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఆదేశాలు ఇచ్చింది.


జైళ్ళలో ఉంటున్న ఖైదీల్లో కోవిడ్-19 సోకడానికి అవకాశం ఉన్నవారిని అత్యవసరంగా గుర్తించాలని రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన హై పవర్డ్ కమిటీలను ఆదేశించింది. ఈ మహమ్మారి నుంచి గట్టెక్కడం కోసం గత ఏడాది పెరోల్ మంజూరు చేసినవారికి, మరోసారి 90 రోజుల సెలవును మంజూరు చేయాలని ఆదేశించింది. ఇటువంటివారికి తగిన షరతులను కూడా విధించాలని తెలిపింది. విలువైన సమయాన్ని ఆదా చేయడం కోసం ఈ ఆదేశాలు ఇస్తున్నట్లు తెలిపింది. 


గత ఏడాది మార్చి 23న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలు హై లెవెల్ కమిటీలను ఏర్పాటు చేయాలని తెలిపింది. కోవిడ్-19 మహమ్మారి నుంచి తప్పించుకోవడానికి వీలుగా జైళ్ళు క్రిక్కిరిసిపోకుండా చర్యలు తీసుకోవాలని తెలిపింది. ఏడేళ్ళ కన్నా ఎక్కువ శిక్ష విధించడానికి వీలులేని ఆరోపణలను ఎదుర్కొంటున్న విచారణ ఖైదీలకు తాత్కాలిక బెయిలు మంజూరు చేయడాన్ని పరిశీలించాలని పేర్కొంది. జైళ్లు క్రిక్కిరిసిపోవడమనేది భారత దేశంతో సహా అనేక దేశాల్లో సాధారణ విషయంగా మారిందని పేర్కొంది. 


ఖైదీలకు, జైలు సిబ్బందికి రెగ్యులర్‌గా టెస్ట్‌లు చేయించి, కోవిడ్ వ్యాప్తిని నిరోధించాలని, అవసరమైనవారికి చికిత్స చేయించాలని తెలిపింది. ప్రతి రోజూ పరిశుభ్రత, పారిశుద్ధ్య కార్యక్రమాలను నిర్వహించాలని పేర్కొంది. జైళ్ళలో నిర్బంధంలో ఉన్నవారికి ఈ మహమ్మారి సోకకుండా తగిన చర్యలు నిరంతరం చేపట్టాలని పేర్కొంది. 


Updated Date - 2021-05-08T20:28:00+05:30 IST