డిష్‌ అబ్బాయి నుంచి కార్పొరేటర్‌ వరకు..

ABN , First Publish Date - 2021-05-02T16:13:28+05:30 IST

నగరంలోని కాకర్లతోట 5వ వార్డు కిందకు వస్తుంది. కాకర్లతోట, ముండ్రిగి, వెంకటాపురం కలిపి సుమారు 6 వేల ఓట్లు ఉంటాయి. కాకర్లతోటకు చెందిన రాజశేఖర్‌ డిష్‌ కనెక్షన్లలో లోపాలను సరిచేస్తూ

డిష్‌ అబ్బాయి నుంచి కార్పొరేటర్‌ వరకు..

   - చందాలు వేసుకుని నామినేషన్‌ వేయించిన కాకర్లతోట ప్రాంతవాసులు

  - ప్రచారం నిర్వహించి గెలిపించుకున్న వైనంఅతను డిష్‌ కనెక్షన్లలో వచ్చే లోపాలను సరిచేసేవాడు. అమ్మ దిన కూలీ. నాన్న హమాలీ. పనిచేస్తేనేకాని పూటగడవని పేదస్థితి. ఇలాంటి స్థితిలో ఉన్నవాడు రాజకీయాల్లో రాణించడం సాధ్యమేనా..? పైగా డబ్బున్నొళ్లకే రాజకీయం అన్న రోజులు ఇవి. అయితే కాకర్లకోట ప్రాంత వాసులు చందాలు వేసుకుని మరీ అతడితో నామినేషన్‌ వేయించి ప్రచారం చేసి కార్పొరేటర్‌గా ఎన్నుకున్నారు. 


బళ్లారి(కర్ణాటక): నగరంలోని కాకర్లతోట 5వ వార్డు కిందకు వస్తుంది. కాకర్లతోట, ముండ్రిగి, వెంకటాపురం కలిపి సుమారు 6 వేల ఓట్లు ఉంటాయి. కాకర్లతోటకు చెందిన రాజశేఖర్‌ డిష్‌ కనెక్షన్లలో లోపాలను సరిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. అందరూ అతడిని డిష్‌ అబ్బాయ్‌ అంటుంటారు. పిల్లలకు ఉచితంగా ట్యూషన్‌ చెబుతూ అందరి మన్ననలు పొందాడు. ఎవరైనా పని పురమాయిస్తే ఆ పనిచేసిపెట్టేవాడు. దీంతో అందరి వద్దా మంచి స్థానాన్ని పొందాడు. ఈ నేపథ్యంలో కార్పొరేషన్‌ ఎన్నికలు వచ్చాయి. బీజేపీ తరపున ఆర్థికంగా ఉన్న అభ్యర్థి రంగంలోకి దిగాడు. ఇక కాంగ్రెస్‌ పార్టీ తరపున ఎవరిని నిలబెట్టాలన్న ఆలోచన వచ్చింది. ఈ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉంది. కమ్మ సామాజిక వర్గం ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంలో ఈ వర్గం వారు అన్ని వర్గాలతో సంప్రదించి చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. అదే ఎన్నికల విషయంలోనూ జరిగింది. అందరికీ అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేసే అభ్యర్థిని రంగంలోకి దింపాలని అనుకున్నారు. ఈ నేపథ్యంలో రాజశేఖర్‌ను సంప్రదించారు. నామినేషన్‌కు సంబంధించి డిపాజిట్‌ కట్టేందుకు కూడా తన వద్ద డబ్బులేదని, ప్రస్తుత రాజకీయాలు డబ్బుతో ముడిపడ్డాయని వారికి రాజశేఖర్‌ తేల్చిచెప్పాడు. నీకు అండగా ఉంటామంటూ ఆ ప్రాంతవాసులు చందాలు వేసుకుని రాజశేఖర్‌తో నామినేషన్‌ వేయించారు. కరపత్రాలు, వాల్‌పోస్టర్లకు డబ్బును పోగుచేసి ప్రచారం నిర్వహించారు. ఫలితాలు వెలువడ్డాయి. అందులో బలమైన బీజేపీ అభ్యర్థిపై రాజశేఖర్‌ విజయం సాధించాడు. దీంతో ఆ ప్రాంతవాసుల ఆనందానికి అవధుల్లేవు. కాకర్లతోట అభివృద్ధికి రాజశేఖర్‌ చిత్తశుద్ధితో కృషి చేస్తాడంటూ ఆనందం వ్యక్తం చేశారు. సేవాతత్పరులు, మంచి వ్యక్తిత్వం ఉన్న వారిని అభ్యర్థులుగా గెలుపించుకోవాలని అప్పుడే అభివృద్ధి సాధ్యమని కాకర్లతోట ప్రాంతవాసులు అంటున్నారు. 


రుణపడివుంటా: రాజశేఖర్‌

కార్పొరేటర్‌గా నామినేషన్‌ వేయమని అడిగినప్పుడు నా పరిస్థితి వారికి వివరించా. అండగా మేముంటాం పోటీచేయాలని పట్టుబట్టారు. చందాలు పోగుచేశారు. నామినేషన్‌ వేయించి నా తరపున ప్రచారం చేశారు. నా గెలుపునకు కృషి చేశారు. సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేస్తా. కాకర్లతోట ప్రాంతవాసులకు ఎప్పటికీ రుణపడివుంటా.Updated Date - 2021-05-02T16:13:28+05:30 IST