టిక్కెట్ నిరాకరించడంతో మహిళా కాంగ్రెస్ చీఫ్ రాజీనామా, శిరోముండనం

ABN , First Publish Date - 2021-03-15T00:53:02+05:30 IST

అసెంబ్లీ టిక్కెట్ల కేటాయింపు విషయంలో కేరళ కాంగ్రెస్‌‌లో అసంతృప్తులు..

టిక్కెట్ నిరాకరించడంతో మహిళా కాంగ్రెస్ చీఫ్ రాజీనామా, శిరోముండనం

తిరువనంతపురం: అసెంబ్లీ టిక్కెట్ల కేటాయింపు విషయంలో కేరళ కాంగ్రెస్‌‌లో అసంతృప్తులు బయటపడుతున్నాయి.‌ తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత లతికా సుభాష్ ఆ పార్టీ  మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలి పదవికి రాజీనామా చేశారు. ఎన్నికల్లో పోటీకి టిక్కెట్ నిరాకరించడంతో ఆమె ఈ రాజీనామా చేశారు. పార్టీ అభ్యర్థుల జాబితాలో మహిళలకు తగిన ప్రాధాన్యం ఇవ్వకపోవడంపై నిరసన తెలుపుతూ శిరోముండనం చేయించుకున్నారు. ఎత్తుమనూర్ నియోజకవర్గం టిక్కెట్టును లతికా సుభాష్ ఆశించారు. 2018లో ఆమెను మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిగా రాహుల్ గాంధీ నియమించారు. రాహుల్ ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు.


బయటపడుతున్న విభేదాలు

పార్టీకి దశాబ్దాలుగా సేవలందిస్తున్న మహిళలను కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్య చేస్తోందని లతిక ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఏ పార్టీలోనూ చేరడం లేదని, ఇండిపెండెంట్ అభ్యర్థుగా పోటీ చేసే అవకాశాలపై కూడా ప్రస్తుతం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. దీనికి ముందు, పార్టీ సీనియర్ నేత, ఎంపీ కే.సుధాకరన్ సైతం టిక్కెట్ల కేటాయింపుపై ఆరోపణలు గుప్పించారు. సీట్ల కేటాయింపు విషయంలో అభ్యర్థులు గెలిచే అవకాశాలను కానీ, వారి అర్హతలను కానీ పార్టీ పరిగణనలోకి తీసుకోవడం లేదని,  గ్రూపుల ఆధారంగానే టిక్కెట్లు కేటాయిస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. కనీసం తన నియోజకవర్గమైన కన్నూరులో అభ్యర్థి ఎంపిక విషయంలోనూ తనను సంప్రదించలేదని ఆయన ఆరోపించారు. సుధాకరన్ కేరళ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు.

Updated Date - 2021-03-15T00:53:02+05:30 IST