అమెరికాపై డెల్టా పడగ
ABN , First Publish Date - 2021-07-08T08:41:10+05:30 IST
అమెరికాలో డెల్టా వేరియంట్ (బి.1.617.2) కేసులు వేగంగా పెరుగుతున్నాయి.

వాషింగ్టన్, జూలై 7 : అమెరికాలో డెల్టా వేరియంట్ (బి.1.617.2) కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఆ దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల్లో 51% డెల్టా వేరియంట్‌వేనని యూఎస్ ‘సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ)’ తాజా నివేదికలో వెల్లడైంది. మిస్సౌరీ, కాన్సస్, అయోవా వంటి రాష్ట్రాల్లో అయితే ఏకంగా 80% ఇన్ఫెక్షన్లకు ఈ వేరియంటే కారణమవుతోంది. యూటా, కొలరాడో వంటి రాష్ట్రాల్లో 74.3% ఇన్ఫెక్షన్లకు.. టెక్సస్, లౌజియానా, ఆర్కన్సాస్, ఒక్లహామా వంటి దక్షిణాది రాష్ట్రాల్లో 58.8% ఇన్ఫెక్షన్లకు కారణం డెల్టా వేరియంటేనని సీడీసీ అంచనా వేసింది.
అయితే.. అమెరికాలో డెల్టా వేరియంట్ వ్యాపించే సమయానికే పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ జరగడం, ఆ టీకాలు మంచి ప్రభావం చూపడంతో డెల్టా కేసులు పెరుగుతున్నా తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిపాలయ్యేవారి, మరణాల సంఖ్య బాగా తక్కువగా ఉంది. డెల్టా వేరియంట్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో.. వ్యాక్సిన్ వేయించుకోని వారంతా ముందుకు రావాలని ప్రజారోగ్య అధికారులు పిలుపునిచ్చారు.