ఢిల్లీలో డెంగీ.. కాన్పూర్‌లో జికా కలకలం

ABN , First Publish Date - 2021-11-09T07:26:01+05:30 IST

దేశ రాజధాని ఢిల్లీలో డెంగీ మరింత తీవ్రమవుతోంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 9 మంది ప్రాణాలు కోల్పోగా తాజాగా..

ఢిల్లీలో డెంగీ.. కాన్పూర్‌లో జికా కలకలం

దేశ రాజధానిలో 9కి చేరిన మృతులు

కాన్పూర్‌లో 17 మంది పిల్లలకు జికా


న్యూఢిల్లీ, నవంబరు 8: దేశ రాజధాని ఢిల్లీలో డెంగీ మరింత తీవ్రమవుతోంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 9 మంది ప్రాణాలు కోల్పోగా తాజాగా మరో ముగ్గురు కన్నుమూశారు. 2017 తర్వాత ఈ మరణాలే అత్యధికం. మరోవైపు బాధితుల సంఖ్య 2,708కి పెరిగింది. గత వారం రోజుల్లోనే 1,170 కేసులు నమోదయ్యాయి. అక్టోబరు నెల మొత్తం మీద 1,196 డెంగీ కేసులు రాగా.. నవంబరులో 7 రోజుల్లోనే దాదాపు అన్ని కేసులు రావడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని పారిశ్రామిక నగరం కాన్పూర్‌లో జికా బారినపడిన 89 మందిలో 17 మంది పిల్లలున్నారు. ఓ గర్భిణికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో ప్రత్యేక ఆరోగ్య బృందాలను నియమించారు. కాగా, దేశంలో ఆదివారం 11,451 మందికి కొవిడ్‌ నిర్ధారణ అయింది. 262 మంది చనిపోయినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇందులో కేరళ మరణాలే 201 ఉన్నాయి.


శీతలీకరణ అవసరం లేని కొవిడ్‌ టీకా

శీతలీకరణ అక్కర్లేని, అతి సులువుగా ఉత్పత్తి చేయగల కొవిడ్‌ టీకాను అమెరికాలోని బోస్టన్‌ చిల్డ్రన్స్‌ ఆస్పత్రి పరిశోధక బృందం రూపొందించింది. కరోనా స్పైక్‌ ప్రొటీన్‌ను ఉపయోగించి ఉత్పత్తి చేసిన ఈ టీకాను గది ఉష్ణోగ్రతలో ఏడు రోజులు నిల్వ చేసే వీలుంది. ఫ్రిజ్‌లోంచి తీసి ఏడు రోజుల పాటు బయట ఉంచినా.. టీకా సామర్థ్యం ఏమాత్రం తగ్గలేదని పరిశోధకులు తెలిపారు. అభివృద్ధి చెందని దేశాల్లో టీకా శీతలీకరణ ఇబ్బందిగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజా టీకాకు మాత్రం ఈ ఇబ్బందులుండవని పరిశోధకులు చెబుతున్నారు. లేవు. మరోవైపు ఇది పూర్తిగా ప్రొటీన్‌ ఆధారిత టీకా కావడంతో ఉత్పత్తి ఖర్చు కూడా చాలా తక్కువ.


కొవిడ్‌ వ్యాక్సిన్‌ ట్రయల్స్‌ వ్యాజ్యంపై 29న విచారణ

కొవిడ్‌ వ్యాక్సిన్‌లకు సంబంధించిన క్లినికల్‌ ట్రయల్స్‌ సమాచారాన్ని వెల్లడించేలా ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై నవంబరు 29న విచారణ చేపట్టనున్నట్టు సుప్రీం కోర్టు పేర్కొంది. క్లినికల్‌ ట్రయల్స్‌ డేటాతోపాటు టీకా తీసుకున్న తర్వాత కొవిడ్‌ సోకిన వారి వివరాలను కూడా వెల్లడించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్‌ సుప్రీం కోర్టును కోరారు. దీనిపై విచారణ  చేపట్టిన ద్విసభ్య ధర్మాసనం... గత ఆగస్టులో కేంద్రంతోపాటు భారత్‌ బయోటెక్‌, సీరం ఇనిస్టిట్యూట్‌లకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇది జరిగి మూడు నెలలు కావస్తున్నా కేంద్రం, సంబంధిత కంపెనీలు స్పందించకపోవడాన్ని పిటిషనర్‌ తరఫు న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కేంద్రం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపిస్తూ... ప్రభుత్వ స్పందన తెలియజేయడానికి మూడు వారాలు సమయం కావాలని కోరారు. దీనికి అంగీకరిస్తూ కోర్టు విచారణను వాయిదా వేసింది.

Updated Date - 2021-11-09T07:26:01+05:30 IST