ఆ రాష్ట్రానికీ ఉచిత విద్యుత్, నీరు: సీఎం హామీ!

ABN , First Publish Date - 2021-03-22T14:45:59+05:30 IST

ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్‌లోనూ ఉచిత విద్యుత్...

ఆ రాష్ట్రానికీ ఉచిత విద్యుత్, నీరు: సీఎం హామీ!

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్‌లోనూ ఉచిత విద్యుత్, నీరు హామీని గుప్పించింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ ఇప్పటినుంచే పంజాబ్‌లో పాగా వేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఢిల్లీలో ఉచిత విద్యుత్ అందించి, విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ ఇదే ఉచితాన్ని పంజాబ్‌లోనూ అమలు చేయాలని భావిస్తోంది. మరోవైపు సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనకు కూడా ‘ఆప్’ మద్దతు పలుకుతూ, పంజాబ్ రైతులకు అండగా నిలిచింది. 


‘ఆప్’ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కిసాన్ మహాసమ్మేళన్‌లో మాట్లాడుతూ పంజాబ్... వీరుల జన్మస్థలమని, అటువంటివారిని స్మరించుకోవాలని అన్నారు. దేశంలో ఎక్కడ అన్యాయం జరిగినా దానికి వ్యతిరేకంగా ముందుగా పంజాబ్ తన గొంతు వినిపిస్తుందన్నారు. పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ ఏర్పడితే ఢిల్లీలో మాదిరిగానే ఉచితంగా విద్యుత్, నీరు అందిస్తామన్నారు. మోదీ ప్రభుత్వం పార్లమెంట్‌లో వ్యవసాయ బిల్లులు ప్రవేశపెట్టి ముఖ్యమంత్రి అధికారాలను కూడా లాక్కున్నదని ఆరోపించారు. ఢిల్లీలో నిరసన ప్రదర్శనలు చేస్తున్న రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారికి ఎటువంటి హాని కలుగకుండా చూస్తామని సీఎం కేజ్రీవాల్ హామీ ఇచ్చారు.

Updated Date - 2021-03-22T14:45:59+05:30 IST