ప్రయాణానికి గంట కొవిడ్‌ టెస్టుకు 3 గంటలు

ABN , First Publish Date - 2021-12-07T06:51:24+05:30 IST

అసలే కిటకిటలాడే విమానాశ్రయం అది.. దీనికితోడు ఒమైక్రాన్‌ వేరియంట్‌ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనలతో మరింత రద్దీని ఎదుర్కొంటోంది. గంట ప్రయాణ...

ప్రయాణానికి గంట కొవిడ్‌ టెస్టుకు 3 గంటలు

ఢిల్లీ విమానాశ్రయంలో భారీ రద్దీ


న్యూఢిల్లీ, డిసెంబరు 6: అసలే కిటకిటలాడే విమానాశ్రయం అది.. దీనికితోడు ఒమైక్రాన్‌ వేరియంట్‌ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనలతో మరింత రద్దీని ఎదుర్కొంటోంది. గంట ప్రయాణ వ్యవధికి మూడు గంటల పాటు వరుసలో నిరీక్షించాల్సి వస్తోంది. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ప్రస్తుత పరిస్థితి ఇది. ఒమైక్రాన్‌ వ్యాప్తి రీత్యా.. కేంద్రం పలు దేశాలను ముప్పు జాబితా లో చేర్చింది. వీటినుంచి వచ్చేవారికి ఈ నెల 1 నుంచి కొవిడ్‌ టెస్టులను తప్పనిసరి చేసింది. ఈ క్రమంలో ప్రయాణికులు టెస్టులకు భారీగా గుమిగూడుతున్నారు.


ఆర్టీపీసీఆర్‌కు రూ.500 తీసుకుంటున్నా.. ఫలితం రావడానికి ఆరు గంటలపైగా పడుతోంది. అదే సమయంలో రూ.3,500 వసూలు చేస్తూ గంటన్నర లోపలే ఫలితం వస్తుండడంతో యాంటీజెన్‌ టెస్టు సెంటర్ల వద్ద పెద్దఎత్తున చేరుతున్నారు. అయితే, సంఖ్యరీత్యా ఇందుకు కూడా గంటల వ్యవధి పడుతోంది. మాస్క్‌లు కూడా తక్కువమంది ధరిస్తున్నారు. దీంతో వైరస్‌ కేంద్ర స్థానంగా మారే ప్రమాదం ఉందనే ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియా సోమవారం జీఎంఆర్‌ గ్రూప్‌ నిర్వహణలోని ఢిల్లీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు లిమిటెడ్‌ (డీఐఏఎల్‌) వర్గాలతో సమావేశమయ్యారు.


రద్దీ నివారణ కు చర్యలు తీసుకోవాలని సూచించారు.  ఒమైక్రాన్‌ వ్యాప్తి రీత్యా.. ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి ‘‘అదనపు డోసు’’ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని భారత వైద్యుల సంఘం (ఐఎంఏ) కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. 12 నుంచి 18 ఏళ్లలోపు పిల్లలకు వ్యాక్సినేషన్‌ ప్రయత్నాలను వేగిరం చేయాలని కోరింది. సోమవారం ఐఎంఏ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. 


ఫ సోమవారం ముంబైలో ఇద్దరికి ఒమైక్రాన్‌ నిర్ధారణ అయింది. వీరిద్దరూ స్నేహితులు. ఒకరు (37)దక్షిణాఫ్రికా నుంచి తిరిగివచ్చాడు. రెండో వ్యక్తి (36) అమెరికా నుంచి వచ్చాడు. వీరిద్దరూ ఫైజర్‌ టీకా తీసుకున్నారు.   ఆదివారం 8,306 మందికి వైరస్‌ నిర్ధారణ అయింది. 211 మంది మృతిచెందినట్లు కేంద్రం తెలిపింది. 9వేల మంది కోలుకున్నారు. యాక్టివ్‌ కేసులు 98 వేలకు తగ్గాయి.


బాలల కోసం ‘స్పుత్నిక్‌-ఎం’ టీకా 

భారత్‌లోని బాలల కోసం ప్రత్యేకమైన కొవిడ్‌ టీకాను తీసుకొచ్చే ప్రయత్నాల్లో ‘స్పుత్నిక్‌-వి’ వ్యాక్సిన్‌ తయారీ సంస్థ రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వె్‌స్టమెంట్‌ ఫండ్‌ (ఆర్‌డీఐఎఫ్‌) నిమగ్నమైంది. 12-17 ఏళ్లలోపు వారికి అందించేందుకు ‘స్పుత్నిక్‌-ఎం’ పేరిట టీకా రిజిస్ట్రేషన్‌ కోసం డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ)కు దరఖాస్తు సమర్పించింది. కాగా, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి అదనపు టీకా డోసును అందుబాటులోకి తేవాలా ? వద్దా ? అనే అంశంపై చర్చించేందుకు వ్యాక్సినేషన్‌ జాతీయ సాంకేతిక సలహా బృందం (ఎంటగీ) సోమవారం సమావేశమైంది. అయితే ఎంటగీ సభ్యుల మధ్య ‘అదనపు డోసు’కు సంబంధించి ఏకాభిప్రాయం కుదరలేదని అధికార వర్గాలు తెలిపాయి. 

Updated Date - 2021-12-07T06:51:24+05:30 IST