భారత దేశంలో తొలి ఒమైక్రాన్ మరణం

ABN , First Publish Date - 2021-12-31T16:34:37+05:30 IST

దేశంలో తొలి ఒమైక్రాన్ మరణం సంభవించింది. కొత్ వేరియంట్ బారిన పడినవారి సంఖ్య 12 వందలు దాటింది.

భారత దేశంలో తొలి ఒమైక్రాన్ మరణం

న్యూఢిల్లీ: దేశంలో తొలి ఒమైక్రాన్ మరణం సంభవించింది. కొత్త వేరియంట్ బారిన పడినవారి సంఖ్య 12 వందలు దాటింది. మహారాష్ట్రలోని పింపిరీకి చెందిన 52 ఏళ్ల వ్యక్తి మరణానికి ఒమైక్రాన్ కారణం కావచ్చునని అధికారులు భావిస్తున్నారు. గుండె పోటుతో చనిపోయిన ఆ వ్యక్తి శరీరంలో ఒమైక్రాన్ వైరస్‌ను గుర్తించారు. అయితే ఒమైక్రాన్ మరణంపై  మహారాష్ట్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.


ఒమైక్రాన్ కేసులు పెరుగుతుండడంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలను కొనసాగిస్తోంది. ఒకేచోట 50 మంది, అంతకంటే ఎక్కువమంది గుమికూడవద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. ఇంతకుముందు పెళ్లిళ్లు, వేడుకలను 250 మంది హాజరు కావచ్చునని చెప్పిన ప్రభుత్వం.. తాజాగా ఆ ఆంక్షలను సవరించింది. 50 మంది కంటే ఎక్కువమంది హాజరు కావద్దని ఆదేశాలు జారీ చేసింది. అలాగే అంత్యక్రియలకు 20 మందిని మించకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది.


కాగా దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య 1270కి చేరింది. ఇప్పటివరకూ 23 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 450, ఢిల్లీలో 320, కేరళలో 109, గుజరాత్ 97, రాజస్థాన్ 69, తెలంగాణ 62, తమిళనాడులో 46, కర్ణాటక 34 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ భారత్‌లో ఒమిక్రాన్ నుంచి 374 మంది కోలుకున్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Updated Date - 2021-12-31T16:34:37+05:30 IST