IMD forecast: అండమాన్ సముద్రంలో మరో అల్పపీడనం

ABN , First Publish Date - 2021-10-08T13:31:52+05:30 IST

ఉత్తర అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తాజాగా అంచనా వేసిన తర్వాత...

IMD forecast: అండమాన్ సముద్రంలో మరో అల్పపీడనం

న్యూఢిల్లీ : ఉత్తర అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తాజాగా అంచనా వేసింది. దీంతో ఒడిశా రాష్ట్రానికి మరో తుఫాన్ భయం పట్టుకుంది.అక్టోబర్ 10 వతేదీన అండమాన్ సముద్రంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ విడుదల చేసిన తాజా వెదర్ బులెటిన్‌లో పేర్కొంది. సముద్రంలో ఏర్పడిన ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్రప్రదేశ్ వైపు కదులుతోందని, రాబోయే నాలుగు నుంచి ఐదు రోజుల్లో ఇది మరింత చేరువ అవుతుందని వాతావరణశాఖ అధికారులు చెప్పారు.అక్టోబరు నెల తుపాన్ నెలగా పరిగణిస్తున్నందున వీటి వల్ల ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు.  


1999 అక్టోబరు 29వతేదీన పారాదీప్ సమీపంలో తీరం దాటిన సూపర్ సైక్లోన్ వల్ల 10వేల మంది మరణించారు.2013, 2014, 2018 సంవత్సరాల్లో అక్టోబరు నెలలోనే పైలిన్, హుదుద్, తిత్లీ తుపాన్లు సంభవించాయి.ఈ ఏడాది సెప్టెంబర్‌లో గులాబ్ తుఫాను ఆంధ్రప్రదేశ్‌లో భూభాగాన్ని తాకింది. గులాబ్ తుపాన్ దక్షిణ ఒడిశాలోని పలు జిల్లాలను ప్రభావితం చేసింది.దుర్గా పూజ సమయంలో దక్షిణ బెంగాల్‌లో వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు చెప్పారు. ప్రస్థుత వాతావరణ పరిస్థితి మరో తుపాన్ కు అనుకూలంగా ఉందని వాతావరణశాఖ మాజీ డైరెక్టరు శరత్ సాహు చెప్పారు.


 చెన్నై, కోల్‌కతాలో ఉరుములతో కూడిన తేలికపాటి జల్లులు పడవచ్చని ఐఎండీ అధికారులు చెప్పారు. బెంగళూరులో కురుస్తున్న భారీ వర్షం నేపథ్యంలో కర్ణాటక రాష్ట్ర సీఎం బసవరాజ్ బొమ్మాయ్ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.సుందర్‌గఢ్, బార్‌గఢ్, ఝార్సుగూడ, సంబల్‌పూర్, డియోగఢ్, అంగుల్, మయూర్‌భంజ్, కియోంజర్, బాలాసోర్, మల్కన్ గిరి, కోరాపుట్, నవరంగ్‌పూర్, రాయగడ, కలహండి, కంధమాల్, గజపతి, గంజాం జిల్లాల్లో అక్టోబర్ 9 ఉదయం వరకు భారీ వర్షాలు కురవవచ్చని వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరించారు. భారీవర్షాల నేపథ్యంలో ఐఎండీ ఎల్లో వార్నింగ్ జారీ చేసింది. 


Updated Date - 2021-10-08T13:31:52+05:30 IST