సీపీఎం శాసనసభా పక్షనేతగా పినరయి విజయన్ నియామకం

ABN , First Publish Date - 2021-05-18T19:53:35+05:30 IST

కేరళ సీపీఎం శాసనసభా పక్ష నేతగా, ముఖ్యమంత్రిగా పినరయి విజయన్ నియమితులయ్యారు. సీపీఎం రాష్ట్ర కమిటీ ఈ నియామకం జరిపింది.

సీపీఎం శాసనసభా పక్షనేతగా పినరయి విజయన్ నియామకం

తిరువనంతపురం : కేరళలో ఎల్‌డీఎఫ్ కూటమి వరుసగా రెండోసారి గెలిచి రికార్డు సృష్టించడమే కాకుండా ఈ కూటమిలోని సీపీఎం మరొక కొత్త ఒరవడికి నాంది పలికింది. పినరయి విజయన్ మినహా మిగిలిన మంత్రులందరినీ పక్కనబెట్టింది. 11 మంది మంత్రులను నియమించుకునేందుకు సీపీఎంకు అవకాశం ఉండగా, పాత మంత్రులందరికీ ఉద్వాసన పలికి, యువతకు పెద్ద పీట వేసింది. మరోవైపు అనుభవజ్ఞులను కూడా కలుపుకునిపోయింది. సీపీఎం నాయకత్వం ఉమ్మడిగా ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. 


కేరళ సీపీఎం శాసనసభా పక్ష నేతగా, ముఖ్యమంత్రిగా పినరయి విజయన్ నియమితులయ్యారు. సీపీఎం రాష్ట్ర కమిటీ ఈ నియామకం జరిపింది. పినరయి విజయన్ తదుపరి ప్రభుత్వంలో మంత్రుల పేర్లను కూడా ప్రకటించింది.  శాసన సభ సభాపతి పదవికి ఎంబీ రాజేశ్‌ను, పార్టీ విప్‌గా కేకే శైలజను ఎంపిక చేసింది. పార్లమెంటరీ పార్టీ కార్యదర్శిగా టీపీ రామకృష్ణన్‌ను నియమించింది. సిట్టింగ్ మినిస్టర్లందరూ ఈసారి మంత్రులయ్యే అవకాశాన్ని కోల్పోయారు. ఈ వివరాలను సీపీఎం రాష్ట్ర కమిటీ మంగళవారం ప్రకటించింది. అంతకుముందు సీపీఎం స్టేట్ సెక్రటేరియట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నారు.


సీపీఎం రాష్ట్ర కమిటీ ప్రకటించిన వివరాల ప్రకారం పినరయి విజయన్ తదుపరి మంత్రివర్గంలో మంత్రి పదవులను చేపట్టబోతున్నవారు... ఎంవీ గోవిందన్, కే రాధాకృష్ణన్, కేఎన్ బాలగోపాల్, పీ రాజీవ్, వీఎన్ వాసవన్, సజి చెరియన్, వీ శివన్ కుట్టి, మహమ్మద్ రియాస్, డాక్టర్ ఆర్ బిందు, వీణా జార్జి, వీ అబ్దుల్ రహమాన్. 


ఇదిలావుండగా, నూతన మంత్రివర్గంలో పెను మార్పులు రాబోతున్నట్లు సీపీఎం ముందుగానే సంకేతాలు ఇచ్చింది. నవ తరానికి పెద్ద పీట వేయనున్నట్లు తెలిపింది. హై ప్రొఫైల్ నేతలను పక్కనబెట్టి కొత్తవారికి అవకాశం ఇవ్వబోతున్నట్లు సంకేతాలు పంపించింది. మాజీ ఆర్థిక మంత్రి థామస్ ఐజాక్, మాజీ పరిశ్రమల మంత్రి ఈపీ జయరాజన్, మాజీ పీడబ్ల్యూడీ మంత్రి జీ సుధాకరన్ వంటివారిని ఎన్నికల బరి నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. 62 మంది సభ్యులుగల పార్లమెంటరీ పార్టీలో కొత్త నేతలు అధికంగా ఉన్నారు. కొత్త తరాన్ని నేతలుగా ఎదిగేలా ప్రోత్సహించాలని సీపీఎం నిర్ణయించింది. 


పినరయి విజయన్ మే 20న కేరళ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇటీవల జరిగిన శాసన సభ ఎన్నికల్లో ఎల్‌డీఎఫ్ కూటమి విజయం సాధించిన సంగతి తెలిసిందే. 


కొత్త మంత్రివర్గం కూర్పుపై సీపీఎం నేత ఏఎన్ షంసీర్ మాట్లాడుతూ, గత మంత్రివర్గంలోనివారిలో కేవలం ముఖ్యమంత్రి పినరయి విజయన్ మాత్రమే కొనసాగుతారని చెప్పారు. మిగిలిన 11 మంది మంత్రులు కొత్తవారేనని చెప్పారు. ఈ మంత్రివర్గం యువ నేతలు, అనుభవజ్ఞుల సమ్మేళనమని తెలిపారు. కోవిడ్-19 మహమ్మారిని దీటుగా ఎదుర్కొన్న మాజీ ఆరోగ్య శాఖ మంత్రి కేకే శైలజకు ఈసారి మంత్రి పదవి దక్కకపోవడంపై ప్రశ్నించినపుడు షంసీర్ స్పందిస్తూ, ఇది తమ పార్టీ సమష్టి నిర్ణయమని, సమష్టి నాయకత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. తమ పార్టీ నుంచి ఓ వ్యక్తిని మినహాయించవద్దని కోరారు. ఈ ప్రశ్నను తమ పార్టీ నేతలను అడగాలన్నారు. 


Updated Date - 2021-05-18T19:53:35+05:30 IST