9 ఐరోపా దేశాల్లో కొవిషీల్డ్‌కు ఓకే
ABN , First Publish Date - 2021-07-02T08:09:21+05:30 IST
మనదేశంలో కొవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్నవారికి ప్రయాణాలకు సంబంధించిన ఆంక్షల నుంచి మినహాయింపును ఇస్తూ తొమ్మిది ఐరోపా దేశాలు నిర్ణయం తీసుకున్నాయి. ఆస్ట్రియా, జర్మనీ....
- ఆయా దేశాల్లో ప్రయాణాలపై ఇక ఆంక్షలుండవు
- భారత విదేశాంగ శాఖ హెచ్చరిక నేపథ్యంలో నిర్ణయం
న్యూఢిల్లీ, జూలై 1: మనదేశంలో కొవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్నవారికి ప్రయాణాలకు సంబంధించిన ఆంక్షల నుంచి మినహాయింపును ఇస్తూ తొమ్మిది ఐరోపా దేశాలు నిర్ణయం తీసుకున్నాయి. ఆస్ట్రియా, జర్మనీ, స్లోవేనియా, గ్రీస్, ఐస్‌ల్యాండ్, ఐర్లాండ్, స్పెయిన్, స్విట్జర్లాండ్, ఎస్టోనియా దేశాలు కొవిషీల్డ్‌ను గుర్తించినట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. యూరోపియన్ యూనియన్ (ఈయూ) దేశాల్లో గురువారం నుంచి గ్రీన్ పాస్ విధానం అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ ఆమోదించిన వ్యాక్సిన్లు తీసుకున్నవారు మాత్రమే ఆయా దేశాల్లో ప్రయాణించడం వీలవుతుంది.
కొవిషీల్డ్, కొవాగ్జిన్‌లను ఈయూ గ్రీన్ పాస్ జాబితాలో చేర్చకపోవడంతో భారత విదేశాంగ శాఖ బుధవారం ఘాటుగా స్పందించింది. భారత్‌లో వేసిన వ్యాక్సిన్లను గుర్తించకపోతే ఈయూ దేశాల నుంచి వచ్చేవారికి క్వారంటైన్‌ను తప్పనిసరి చేస్తామని హెచ్చరించింది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని కొవిన్ పోర్టల్ ద్వారా తీసుకున్న వ్యాక్సి న్ సర్టిఫికెట్లను ఆమోదించాలని ఐరోపా దేశాలను కోరింది. దీంతో కొన్ని ఐరోపా దేశాలు దిగొచ్చాయి. కొవిషీల్డ్ తీసుకున్న వారిని ప్రయాణ ఆంక్షల నుంచి మినహాయించాయి. ఈస్టోనియా మాత్రం భారత ప్రభుత్వం ఆమోదించిన ఏ వ్యాక్సిన్ తీసుకున్నవారైనా తమదేశంలో స్వేచ్ఛగా ప్రయాణించవచ్చని పేర్కొంది.