చెంగల్పట్టు, కున్నూరు కేంద్రాల్లో త్వరలో టీకాల తయారీ

ABN , First Publish Date - 2021-10-29T15:19:57+05:30 IST

చెంగల్పట్టు, కున్నూరులలో టీకా తయారీ కేంద్రాలు త్వరలో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం తెలిపారు. ఢిల్లీలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మాంచుక్‌ మాండవ్యాను కలుసుకుని రాష్ట్రానికి

చెంగల్పట్టు, కున్నూరు కేంద్రాల్లో త్వరలో టీకాల తయారీ

                    - ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రమణ్యం


చెన్నై(Tamilnadu): చెంగల్పట్టు, కున్నూరులలో టీకా తయారీ కేంద్రాలు త్వరలో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం తెలిపారు. ఢిల్లీలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మాంచుక్‌ మాండవ్యాను కలుసుకుని రాష్ట్రానికి మరింతగా కరోనా నిరోధక టీకాలు కేటాయించాలని, కొత్తగా ప్రారంభించిన 11 వైద్య కళాశాలల్లో సీట్ల సంఖ్యను పెంచాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. గురువారం కేంద్ర ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్రాల ఆరోగ్యశాఖ మంత్రుల సమావేశంలో సుబ్రమణ్యం పాల్గొన్నారు. ఈ సమావేశానికి ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి రాధాకృష్ణన్‌, ఆరోగ్యశాఖ సంచాలకులు డాక్టర్‌ సెల్వనాయగం, వైద్య సేవల విభాగం సంచాలకులు డాక్టర్‌ నారాయణబాబు తదితరులు హాజరయ్యారు. ఈ సమావేశానంతరం మంత్రి సుబ్రమణ్యం మీడియా సమావేశంలో మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం 18 యేళ్లలోపు వారికి కరోనా నిరోధక టీకాలు వేసే విషయాన్ని పరిశీలిస్తోందని, ఆ నిర్ణయం అమలులోకి వస్తే మొదటగా తమిళనాట టీకాలు వేయడానికి అనుమతివ్వాలని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రికి తాను విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు. రాష్ట్రంలో ఆరువిడతలుగా నిర్వహించిన మెగా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌కు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించిందని, ఏడో విడత వ్యాక్సినేషన్‌ శనివారం నిర్వహించనున్నామని చెప్పారు. ఏడో విడత వ్యాక్సినేషన్‌ కోసం 10 లక్షల డోసుల వరకు కొవాగ్జిన్‌ రాష్ట్రానికి సరఫరా చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశానన్నారు. చెంగల్పట్టు, కున్నూరులో టీకా తయారీ కేంద్రాల్లో వ్యాక్సిన్‌ తయారు చేసేందుకు అన్ని సదుపాయాలున్నాయని, ఈ కేంద్రాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరించేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్టు కేంద్ర ఆరోగ్య మంత్రికి తెలిపానని, వీలైనంత త్వరగా ఆ రెండు కేంద్రాల్లో టీకాల తయారీకి అనుమతించే విషయంపై నిర్ణయం తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారని మంత్రి సుబ్రమణ్యం తెలిపారు.

Updated Date - 2021-10-29T15:19:57+05:30 IST