కోవిడ్ సెకండ్ వేవ్ మానవతావాద సంక్షోభం : జపనీస్ సంస్థ

ABN , First Publish Date - 2021-05-21T00:28:45+05:30 IST

భారత దేశంలో కోవిడ్-19 మహమ్మారి రెండో ప్రభంజనం

కోవిడ్ సెకండ్ వేవ్ మానవతావాద సంక్షోభం : జపనీస్ సంస్థ

ముంబై : భారత దేశంలో కోవిడ్-19 మహమ్మారి రెండో ప్రభంజనం ఆర్థికపరమైనదిగా కన్నా మానవతావాదపరమైనదిగా ఉందని జపనీస్ బ్రోకరేజ్ సంస్థ నొముర నివేదిక పేర్కొంది.ఈ సంక్షోభ తీవ్రత పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది.  ఆర్థిక వ్యవస్థ పనితీరు స్వల్ప కాలంలో ఎలా ఉందో పరిశీలించినపుడు ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ప్రతికూల ప్రభావం చాలా తక్కువగా ఉంటుందని అంచనా వేసింది. 


గత ఏడాది దేశవ్యాప్తంగా అష్టదిగ్బంధనం విధించారని, అప్పటి పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థ పని తీరును పోల్చినపుడు ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థపై పడే ప్రతికూల ప్రభావం చాలా తక్కువగా ఉంటుందని అంచనా వేసినట్లు నొముర తెలిపింది. మార్చి  త్రైమాసికంతో పోల్చుకుంటే జూన్ త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థ కేవలం 3.8 శాతం మాత్రమే తగ్గుతుందని పేర్కొంది. ఈసారి అష్టదిగ్బంధనాలు తక్కువగా ఉన్నాయని, వీటికి కస్టమర్లు, వ్యాపార సంస్థలు అలవాటు పడ్డాయని తెలిపింది. అంతర్జాతీయ పరిస్థితులను పరిశీలించినపుడు కూడా ఇదే విషయం వెల్లడవుతోందని పేర్కొంది. 


ప్రస్తుత లాక్‌డౌన్ మరొక ఆరు వారాలపాటు కొనసాగే అవకాశం ఉందని నొముర అంచనా వేసింది. ప్రస్తుతం వ్యాక్సినేషన్ నత్తనడకన సాగుతున్నప్పటికీ, జూన్ తర్వాత వేగం పుంజుకుంటుందని పేర్కొంది. 2021 ముగిసే సరికి జనాభాలో సగం మందికి టీకాలు వేయడం పూర్తవుతుందని అంచనా వేసింది. సెప్టెంబర్ త్రైమాసికంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఊపందుకుంటుందని తెలిపింది. దీంతో దేశీయ వినియోగం పెరుగుతుందని పేర్కొంది. 


Updated Date - 2021-05-21T00:28:45+05:30 IST