కరోనా కట్టడికి యుద్ధప్రాతిపదికన చర్యలు
ABN , First Publish Date - 2021-05-08T13:42:09+05:30 IST
రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మరు క్షణమే ఎంకే స్టాలిన్ కదనరంగంలోకి దిగారు. రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసే చర్యలపై ఆయన ప్రధానంగా దృష్టి సారించారు.

- కలెక్టర్లకు సీఎం స్టాలిన్ ఆదేశం
- చెన్నై వర్తక కేంద్రంలో తనిఖీలు
అడయార్(చెన్నై): రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మరు క్షణమే ఎంకే స్టాలిన్ కదనరంగంలోకి దిగారు. రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసే చర్యలపై ఆయన ప్రధానంగా దృష్టి సారించారు. ఇందులోభాగంగా, ఆయన శుక్రవారం సాయంత్రం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సచివాలయ ప్రాంగణంలో ని నామక్కల్ కవింజ్ఞర్ భవనంలో ఏర్పాటు చేసిన వీడియోకాన్ఫరెన్స్‌లో సీఎం స్టాలిన్‌తో పాటు కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇరైఅన్బు, మంత్రులు, రాష్ట్రంలో రీజియన్ వారీగా నియమించిన ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం స్టాలిన్ కలెక్టర్లను ద్దేశించి ప్రసంగిస్తూ... ‘‘జిల్లాల్లో ఉన్న కరోనా వాస్తవ పరస్థితులను తెలు సుకునేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశాను. అసత్యాలు చెప్పొద్దు. పొగడ్తలు అసలే వద్దు. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను వివరించండి. రాష్ట్రంలో ప్రతి రోజూ 25 వేలకు పైగా ప్రజలు కరోనా వైర్‌సబారినపడు తున్నారు. మున్ముందు ఈ సంఖ్య మరింతగా పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకు తగినట్టుగా ఆక్సిజన్, పడకలు, మందులు, తదితర సౌకర్యాలను సిద్ధం చేయాలి. చెన్నై, చెంగల్పట్టు, కోవై, మదురై వంటి పలు ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి అధికంగా ఉంది. ఈ వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు వైద్యులు, నర్సులు రేయింబవుళ్ళు శ్రమిస్తున్నారు. అదనంగా వైద్యులు, నర్సులను నియమించేందుకు చర్యలు తీసుకుంటాం. అందువల్ల కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ముఖ్యమంత్రి కోరారు.
ట్రేడ్ సెంటర్‌లో తనిఖీలు
అంతుకుముందు ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నందంబాక్కంలోని చెన్నై వర్తక కేంద్రం (చెన్నై ట్రేడ్ సెంటర్)లో ఏర్పాటు చేసిన కొవిడ్ కేర్ సెంటరుకు వెళ్ళారు. అక్కడ ఏర్పాటు చేసిన వసతులు, సౌకర్యాలను సీఎం స్వయంగా పరిశీలించారు. తర్వాత సచివాల యానికి వచ్చి తనతో పాటు మంత్రులుగా ప్రమాణం చేసిన కొత్త మంత్రులతో తొలి కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో వివిధ అంశాలపై చర్చించినప్పటికీ.. ప్రధానంగా కరోనా వైరస్ వ్యాప్తి కట్టడిపైనే దృష్టిపెట్టినట్టు తెలుస్తోంది. ప్రతి జిల్లాలోని వాస్తవ పరిస్థితులను తెలుసు కుని, ఈ వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయన మంత్రులను ఆదేశించారు.
9 జోన్లుగా రాష్ట్ర విభజన
అలాగే, కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసే చర్యల్లో భాగంగా రాష్ట్రానికి 9 జోన్‌లుగా విభంచించారు. ఒక్కో జోన్‌కు ఒక ఐపీఎస్ అధికారి పర్య వేక్షించేలా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఆ ఆదేశాల మేరకు చెన్నై జోన్ ఎస్పీగా జయరాం నియమితులయ్యారు. అలాగే, తిరువళ్ళూరు, చెంగల్పట్టు, కాంచీపురం జిల్లాలను కలిపి ఒక జోన్‌గా చేసి, ఈ జోన్‌కు ఎస్పీగా సారంగం, వేలూరు జోన్ ఎస్పీగా వనిత, విళుపురం జోన్ ఎస్పీగా పాండ్యన్, సేలం జోన్ ఎస్పీగా దినకరన్, కోయంబత్తూరు జోన్ ఎస్పీగా సంజయ్ కుమార్, తిరుచ్చి జోన్ ఎస్పీగా అమరేష్ పూజారి, తంజావూరు జోన్ రీజియన్ ఎస్పీగా లోకానాథన్, మదురై జోన్ రీజియన్ ఎస్పీగా శైలేష్ కుమార్ యాదవ్, నెల్లై జోన్ ఎస్పీగా మురుగన్ నియమితులయ్యారు. ఈ 9 మంది అధికారులు కూడా కలెక్టర్ల సమాశంలో పాల్గొన్నారు.
40 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరా చేయండి
మరోవైపు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా తక్షణం 40 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరా చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి స్టాలిన్ శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. రాష్ట్రంలో కరోనా వైరస్ రోగుల సంఖ్య పెరుగుతుండటంతో ఆక్సిజన్ నిల్వలు కూడా తరిగిపోతు న్నాయి. ప్రస్తుతం ఉన్న నిల్వలు ఈ వారాంతం వరకు సరిపోతాయనే ప్రచారం జరుగుతోంది. ఈక్రమంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశం అనంతరం, అన్ని జిల్లాల్లో ఉన్న పరిస్థితులు తెలుసుకున్న సీఎం స్టాలిన్ తర్వాత ప్రధానికి లేఖ రాశారు. రెండు మూడు రోజుల్లో రాష్ట్రానికి తక్షణం 40 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను సరఫరా చేయాలని ఆ లేఖలో కోరారు.