పిల్లలకూ ‘కొవ్యాక్సిన్‌’

ABN , First Publish Date - 2021-12-26T07:08:47+05:30 IST

హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ కంపెనీ కొవిడ్‌ టీకా ‘కొవ్యాక్సిన్‌’ను 12-18 ఏళ్లలోపు పిల్లలకు ఇచ్చేందుకు...

పిల్లలకూ ‘కొవ్యాక్సిన్‌’

అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతి

భారత్‌ బయోటెక్‌ వెల్లడి

పిల్లల కోసం వచ్చిన రెండో టీకా ఇది

ట్రయల్స్‌ దశలో మరో మూడు

కొవిడ్‌ రోగుల కాంటాక్టు ట్రేసింగ్‌ నిలిపివేత

క్వారంటైన్‌కూ స్వస్తి.. దక్షిణాఫ్రికా నిర్ణయం

12 ఏళ్లకు పైబడిన వారికి అత్యవసర వినియోగానికి డీసీజీఐ పచ్చజెండా 


న్యూఢిల్లీ, డిసెంబరు 25 : హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ కంపెనీ కొవిడ్‌ టీకా ‘కొవ్యాక్సిన్‌’ను 12-18 ఏళ్లలోపు పిల్లలకు ఇచ్చేందుకు డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) పచ్చజెండా ఊపింది. నిర్దేశిత షరతులకు లోబడి అత్యవసర ప్రాతిపదికన టీకా వినియోగానికి అనుమతులు మంజూరు చేసింది. 2-18 ఏళ్లలోపు బాలలపై కొవ్యాక్సిన్‌తో ప్రయోగ పరీక్షలు జరిపిన భారత్‌ బయోటెక్‌ .. అందుకు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎ్‌ససీవో)కు సమర్పించింది. ఆ వివరాలను విశ్లేషించిన సీడీఎ్‌ససీవో నిపుణుల కమిటీ, పిల్లల్లో కొవ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి అనుమతులు ఇవ్వొచ్చంటూ అక్టోబరు నెలలో డీసీజీఐకి సిఫారసు చేసింది. అందుకు అనుగుణంగానే డీసీజీఐ తాజా నిర్ణయాన్ని ప్రకటించింది. పిల్లలకు కొవ్యాక్సిన్‌ మొదటి డోసును ఇచ్చిన 28 రోజు ల తర్వాత రెండో డోసును ఇవ్వనున్నారు. ఈసందర్భంగా భారత్‌ బయోటెక్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘కరోనా మొదటి రకం వేరియంట్లతో పాటు కొత్తగా వ్యాప్తిలోకి వచ్చిన వాటిపైనా కొవ్యాక్సిన్‌ ప్రభావశీలంగా పనిచేస్తోంది. పిల్లలపై ప్రయోగ పరీక్షల్లో నూ ఇదే విషయం వెల్లడైంది. వయోజనులు, బాలల కు ఒకే విధమైన ఆరోగ్య భద్రతను కొవ్యాక్సిన్‌ కల్పించగలదు’’ అని పేర్కొంది. దీంతో దేశంలో పిల్లలకు అం దుబాటులోకి వచ్చేందుకు అనుమతులు పొందిన టీకా ల సంఖ్య రెండుకు పెరిగింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన జైడస్‌ క్యాడిలా అభివృద్ధిచేసిన ‘జైకోవ్‌-డి’ టీకాను 12 ఏళ్లకు పైబడిన బాలలకు ఇచ్చేందుకు ఆగస్టులోనే డీసీజీఐ అనుమతులిచ్చింది. కాగా, కొవ్యాక్సిన్‌ ముక్కు టీకా ‘బీబీవీ154’ను బూస్టర్‌ డోసు గా తీసుకొచ్చే ప్రయత్నాల్లో భారత్‌ బయోటెక్‌ నిమగ్నమై ఉంది. దానితో మూడోదశ ప్రయోగ పరీక్షలు నిర్వహించేందుకు ఇటీవల అనుమతులు కోరింది. 

 

సీరం, బయొలాజికల్‌-ఈ, జాన్సన్‌.. 

పుణెలోని సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా ‘కోవోవ్యాక్స్‌’ టీకాతో 2-18 ఏళ్లలోపు పిల్లలపై మూడోదశ ప్రయోగ పరీక్షలు నిర్వహిస్తోంది. త్వరలోనే దీనికి కూడా అత్యవసర వినియోగ అనుమతులు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌కే చెందిన బయొలాజికల్‌-ఈ కంపెనీ అభివృద్ధి చేసిన ఆర్‌బీడీ ప్రొటీన్‌ సబ్‌ యూనిట్‌ రకం కొవిడ్‌ టీకాతో 5-18 ఏళ్లలోపు పిల్లలపై ప్రయోగ పరీక్షలు జరిపేందుకు సెప్టెంబరు మొదటివారంలోనే డీసీజీఐ అనుమతులు ఇచ్చింది. అమెరికా కంపెనీ జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ అభివృద్ధి చేసిన పిల్లల కొవిడ్‌ టీకా ‘ఏడీ 26కోవ్‌.2ఎ్‌స’తో 12-17 ఏళ్లలోపు వారిపై ప్రయోగ పరీక్షలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. 


దక్షిణాఫ్రికాలో క్వారంటైన్‌కు స్వస్తి 

ఒమైక్రాన్‌ వెలుగులోకి వచ్చాక విదేశాలు విమాన సర్వీసులు రద్దు చేస్తే.. ఆవేదన వ్యక్తం చేసిన దక్షిణాఫ్రికా, ఇప్పుడు కొవిడ్‌ సోకిన వ్యక్తుల కాంటాక్టుల ఛేదన, క్వారంటైన్‌ను తక్షణమే నిలిపివేస్తూ ఆదేశాలిచ్చింది. మహమ్మారి కారణంగా ఏర్పడిన ఆర్థిక మాంద్యం నుంచి పుంజుకోవడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. బ్రిటన్‌లో మూడో రోజూ లక్షపైగా కొవిడ్‌ కేసులు వచ్చాయి. శుక్రవారం రికార్డు స్థాయిలో 1.22 లక్షల మంది వైరస్‌ బారినపడ్డారు. 


భారత్‌లో ఒమైక్రాన్‌ ఉధృతం

భారత్‌లో రానున్న రోజుల్లో ఒమైక్రాన్‌ వ్యాప్తి భారీగా పెరగొచ్చని ఆ వేరియంట్‌ను తొలిసారి గుర్తించిన దక్షిణాఫ్రికా వైద్య నిపుణురాలు యాంజెలిక్‌ కొయెట్జీ హెచ్చరించారు. ఒమైక్రాన్‌ వేగవంతమైన వ్యాప్తి వల్ల కొవిడ్‌ పాజిటివిటీ రేటు మరింత పెరగొచ్చని, అయితే తేలికపాటి ఇన్ఫెక్షన్లే సోకుతాయని పేర్కొన్నారు. టీకాల వల్ల కొవిడ్‌ వ్యాప్తికి అడ్డుకట్ట పడుతుందని, ఇప్పటిదాకా వ్యాక్సిన్లు తీసుకోని వారికి మాత్రం 100ు ఒమైక్రాన్‌ ముప్పు ఉంటుందన్నారు. వ్యాక్సినేషన్‌ చేయించుకున్న వారిలో మూడింట ఒక వంతు మందికి మాత్రమే కొత్త వేరియంట్‌ సోకే అవకాశాలు ఉంటాయని యాంజెలిక్‌ విశ్లేషించారు. ఇప్పటివరకు వచ్చిన వేరియంట్లలో ఒమైక్రానే బలహీనమైందని, త్వరలోనే కరోనా వ్యాప్తి ఆగిపోతుందంటూ జరుగుతున్న ప్రచారంతో ఆమె విభేదించారు. ‘‘ కరోనా కొంతకాలం తర్వాత స్థానిక వ్యాప్తి (ఎండెమిక్‌) దశకు చేరొచ్చు’’ అని వ్యాఖ్యానించారు. తీవ్ర జ్వరం కలిగిన వారికి ఒమైక్రాన్‌ వేరియంట్‌ పెద్దఎత్తున సోకుతోందన్నారు. పిల్లల్లోనూ ఇది ప్రబలుతున్నప్పటికీ.. సగటున ఐదు నుంచి ఆరు రోజుల్లోనే వారు కోలుకుంటున్నారన్నారు. భవిష్యత్తులో ఒమైక్రాన్‌ వేరియంట్‌లో మరిన్ని ఉత్పరివర్తనాలు జరిగి ప్రమాదకరంగా లేదా బలహీనంగా ఏదో ఒక రకంగా అది  మారొచ్చని అంచనా వేశారు. 

Updated Date - 2021-12-26T07:08:47+05:30 IST