దక్షిణాఫ్రికా అత్యున్నత న్యాయస్థానం.. న్యాయమూర్తిగా భారత సంతతి వ్యక్తి

ABN , First Publish Date - 2021-12-26T07:03:54+05:30 IST

దక్షిణాఫ్రికాలో భారత సంతతి వ్యక్తి ఆ దేశ న్యాయ వ్యవస్థలోని అత్యున్నత పదవికి ఎంపికయ్యారు. రాజ్యాంగ న్యాయస్థానంలోని న్యాయమూర్తిగా ...

దక్షిణాఫ్రికా అత్యున్నత న్యాయస్థానం.. న్యాయమూర్తిగా భారత సంతతి వ్యక్తి

జోహెన్న్‌సబర్గ్‌, డిసెంబరు 25: దక్షిణాఫ్రికాలో భారత సంతతి వ్యక్తి ఆ దేశ న్యాయ వ్యవస్థలోని అత్యున్నత పదవికి ఎంపికయ్యారు. రాజ్యాంగ న్యాయస్థానంలోని న్యాయమూర్తిగా నరేంద్రన్‌ కొల్లాపెన్‌ను నియమిస్తున్నట్లు దేశాధ్యక్షుడు సిరిల్‌ రమఫోసా ప్రకటించారు. ఆయనతోపాటు రమ్మక స్టీవెన్‌ మాథొపోను కూడా న్యాయమూర్తిగా నియమించారు. మొత్తం ఐదుగురు న్యాయమూర్తులు ఉండే రాజ్యాంగ న్యాయస్థానంలో రెండు ఖాళీలు ఏర్పడటంతో ఈ నియామకాలు చేపట్టారు. వీరిద్దరూ వచ్చే నెల 1 నుంచి బాధ్యతలు చేపడతారు. కొల్లాపెన్‌ 1982లో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. మానవ హక్కుల పరిరక్షణకు కృషి చేశారు. 1993లో లాయర్స్‌ ఫర్‌ హ్యూమన్‌ రైట్స్‌లో చేరిన ఆయన.. 1995కు ఆ సంస్థ జాతీయ డైరెక్టర్‌ స్థాయికి ఎదిగారు. 1997లో దక్షిణ ఆఫ్రికా హ్యూమన్‌ రైట్స్‌ కమిషన్‌ చైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు. 2016లో న్యాయ వ్యవస్థ సంస్కరణల సంఘం అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. 2010లో ఓ సదస్సులో మాట్లాడుతూ.. 150ఏళ్ల క్రితం భారతీయులు ఒప్పంద కార్మికులుగా దక్షిణాఫ్రికా వచ్చారని.. దేశాభివృద్ధిలో వారి పాత్ర చెప్పుకోదగిందని అన్నారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను చెప్పుకొనే విషయంలో సిగ్గుపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఇక,  కొల్లాపెన్‌ తల్లి కూడా పలు ప్రజా పోరాటాల్లో చురుగ్గా పాల్గొనేవారు.

Updated Date - 2021-12-26T07:03:54+05:30 IST