కొరియర్ సెంటర్లపై నిఘా
ABN , First Publish Date - 2021-07-08T16:21:19+05:30 IST
రెండేళ్లుగా బెంగళూరు కేంద్రంగా డ్రగ్స్ దందా తీవ్రమవుతున్న నేపథ్యంలో కట్టడి చేసేందుకు పోలీసులు కొత్త వ్యూహానికి సిద్ధమయ్యారు. బెంగళూరుకు కొరియర్ల ద్వారానే డ్రగ్స్ దిగుమతి అవుతుం

- డ్రగ్స్ నియంత్రణకు కొత్త వ్యూహం
- డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు
బెంగళూరు: రెండేళ్లుగా బెంగళూరు కేంద్రంగా డ్రగ్స్ దందా తీవ్రమవుతున్న నేపథ్యంలో కట్టడి చేసేందుకు పోలీసులు కొత్త వ్యూహానికి సిద్ధమయ్యారు. బెంగళూరుకు కొరియర్ల ద్వారానే డ్రగ్స్ దిగుమతి అవుతుండడంతో నగరంలోని అన్ని కొరియర్ సెంటర్ల ప్రధాన కార్యాలయాలపై నిఘా పెట్టారు. ప్రతి చోటా డాగ్ స్క్వాడ్ ద్వారా పరిశీలిస్తున్నారు. డ్రగ్స్ నియంత్రణకు బెంగళూరు పోలీసులు ఎంతగా ప్రయత్నాలు చేస్తున్నా అక్రమ మార్గాల ద్వారా దేశవిదేశాల నుంచి చేరుతూనే ఉన్నాయి. ఆఫ్రికా దేశాలకు చెందిన పలువురు బెంగళూరులోనే మకాం వేసి డ్రగ్స్ వ్యాపారాలు సాగిస్తున్న విషయం తెలిసిందే. వారి కట్టడి కోసం నిరంతరంగా దాడులు సాగుతూనే ఉన్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం నుంచి నగరానికి భారీగా గంజాయితో పాటు డ్రగ్స్ వస్తున్నాయనే సమాచారం మేరకు బుధవారం నగర వ్యాప్తంగా ఉండే కీలకమైన కొరియర్ సెంటర్‌లపై డాగ్‌స్క్వాడ్ బలగాల ద్వారా దాడులు సాగించాయి. నగరంలోని వివేక్‌నగర్, అశోక్‌నగర్, సంపంగిరామనగర్, సదాశివనగర్, శేషాద్రిపురం, వయ్యాలికావల్ ప్రాంతాల కొరియర్ సెంటర్‌లకు మాదకవస్తువులు వస్తాయని తెలుసుకున్న మేరకు 12 బృందాల డాగ్‌స్క్వాడ్ దళాలు దాడుల చేశాయి. సెంట్రల్ డీసీపీ అనుచేత్ నేతృత్వంలో సెర్చ్ ఆపరేషన్ జరిగింది. డ్రగ్‌పెడ్లర్లు, వినియోగదారులపై నిఘా పెట్టిన పోలీసులు భారీ రవాణాను అరికట్టదలచారు.