మరణించిన రైతుల లెక్కలు రాష్ట్రాల వద్దే..!

ABN , First Publish Date - 2021-12-09T07:21:06+05:30 IST

ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనలు చేపట్టిన రైతుల్లో మరణించిన వారి వివరాలు తమ వద్ద లేవని కేంద్ర ప్రభుత్వం మరోమారు వెల్లడించింది.

మరణించిన రైతుల లెక్కలు రాష్ట్రాల వద్దే..!

ఆ వివరాలు మా దగ్గర లేవు

 పరిహారం కూడా రాష్ట్రాల పరిధిలోనిదే: కేంద్రం 


న్యూఢిల్లీ, డిసెంబరు 8: ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనలు చేపట్టిన రైతుల్లో మరణించిన వారి వివరాలు తమ వద్ద లేవని కేంద్ర ప్రభుత్వం మరోమారు వెల్లడించింది. ఆందోళనల సందర్భంగా ఎంత మంది రైతులు మృతి చెందారన్న వివరాలు సంబంధిత రాష్ట్రాల వద్ద ఉంటాయని తెలిపింది. పోలీసులు, శాంతి భద్రతల అంశాలు రాష్ట్రాల పరిధిలోనివని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్‌ బుధవారం రాజ్యసభలో తెలిపారు.  రైతుల మృతి లెక్కలు, నష్టపరిహారం అంశాలు రాష్ట్రాల పరిధిలోనివని స్పష్టం చేశారు. రైతులు వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన ఆందోళనలకు భద్రత కల్పించేందుకు రూ.7.38 కోట్లు వెచ్చించినట్లు తెలిపారు. సైబర్‌ నేరాలను అరికట్టేందుకు కఠిన నిబంధనలు తీసుకురావాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ చెప్పారు. ఓటీటీల్లో ప్రసారమయ్యే సినిమాలు, సీరియళ్లలో అశ్లీల దృశ్యాలు, హింస ఎక్కువగా ఉంటున్నాయని.. ఇది చిన్నారులపై తీవ్ర ప్రభావం చూపుతోందని చెప్పారు. దీన్ని అరికట్టేందుకు పటిష్ఠ చట్టాలను రూపొందించాలని కాంగ్రెస్‌ సభ్యుడు కోరారు. అయితే సైబర్‌ నిబంధనలను కాస్త కఠినతరం చేస్తే చాలు.. ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని, ప్రజల స్వేచ్ఛను హరించివేస్తున్నారని సభ్యులే గొంతు చించుకొని అరుస్తారని వైష్ణవ్‌ గుర్తుచేశారు. 


 పీఎం మిత్ర పార్కు పథకంలో కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కును చేర్చాలని తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిందని, అయితే రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతిపాదనలను చాలెంజ్‌ పద్ధతిలో పరిశీలిస్తామని కేంద్ర జౌళి శాఖ సహాయ మంత్రి దర్శన జర్దోశ్‌ తెలిపారు.

కల్వకుర్తి-హైదరాబాద్‌ హైవేను 4 లేన్ల రహదారిగా విస్తరించాలని  తెలంగాణ పంపిన అభ్యర్థన తమకు అందిందని కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ వెల్లడించారు.

Updated Date - 2021-12-09T07:21:06+05:30 IST