మళ్లీ కట్టడి జోన్లు

ABN , First Publish Date - 2021-03-24T08:57:01+05:30 IST

మళ్లీ కట్టడి జోన్లు

మళ్లీ కట్టడి జోన్లు

కేసుల ఆధారంగా ఆంక్షలు

కేంద్రం కొత్త మార్గదర్శకాలు 

ఏప్రిల్‌ నెలంతా అమలు

దేశంలో 40,715 కేసులు 

కేసుల ‘డబ్లింగ్‌ టైమ్‌’ డౌన్‌

5 రోజుల్లో కొత్త స్ర్టైన్లు రెట్టింపు

ఢిల్లీ, ముంబైల్లో హోలీపై బ్యాన్‌

చెవుల్లో గింగుర్లా కరోనా కావచ్చు


న్యూఢిల్లీ, మార్చి 23 : దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర హోంశాఖ మంగళవారం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. కొవిడ్‌ కేసుల ఆధారంగా కంటోన్మెంట్‌ జోన్లను ప్రకటించాలని నిర్దేశించింది.వాటి వివరాలను సంబంధిత జిల్లాల కలెక్టర్లు ఎప్పటికప్పుడు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయడంతో పాటు కేంద్ర ఆరోగ్యశాఖకు సమాచారాన్ని అందించాలని సూచించింది. ప్రజలు కచ్చితంగా కొవిడ్‌ నిబంధనలను పాటించేలా చర్యలు తీసుకోవాలని, స్థానిక పరిస్థితులను బట్టి ఆంక్షలు విధించుకోవచ్చని కేంద్రం తెలిపింది. రాష్ట్రాల మధ్య రాకపోకలపై నిషేధం లేదని, అందుకోసం ఎటువంటి అనుమతులు అవసరం లేదని స్పష్టంచేసింది. మెట్రో రైళ్లు, విమాన ప్రయాణం, విద్యాసంస్థలు, రెస్టారెంట్లు, షాపింగ్‌ మాల్స్‌, సినిమా హాళ్లు వంటి బహిరంగ ప్రదేశాల్లో నిర్దేశిత ప్రమాణాలు(ఎ్‌సఓపీలు) అమలులో ఉంటాయని పేర్కొంది. ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షల్ని పెంచాలని, వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని మరింత వేగవంతంగా ముందుకు తీసుకెళ్లాలని రాష్ట్రాలను కోరింది. అన్ని లక్షిత వర్గాలకు టీకా అందేలా చూడాలని సూచించింది. టెస్ట్‌-ట్రాక్‌-ట్రీట్‌ నిబంధనను పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించింది. ఈ మార్గదర్శకాలు ఏప్రిల్‌ 1 నుంచి 30 వరకు అమల్లో ఉంటాయని కేంద్ర సర్కారు వెల్లడించింది. కరోనా నేపథ్యంలో ఎంపిక చేసిన మార్గాల్లో అంతర్జాతీయ విమానాల రాకపోకలపై విధించిన తాత్కాలిక నిషేధాన్ని వచ్చే నెల 30 వరకు కేంద్రం పొడిగించింది. కార్గో సర్వీసులకు మాత్రం ఈ నిషేధం వర్తించదని తెలిపింది.  


కొత్త స్ట్రెయిన్‌ కేసులు 795కు..

దేశంలో మరో 40,715 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1.16 కోట్లకు పెరిగింది. ప్రస్తుతం 3,45,377 కేసులు క్రియాశీలంగా ఉన్నాయి. వరసగా 13వ రోజు కూడా కేసుల సంఖ్య పెరిగిందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక 199 మరణాలతో మొత్తం కరోనా మరణాలు 1,60,166కు చేరాయి. కర్ణాటకలో 24గంటల్లో 2050మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. గుజరాత్‌లోని సూరత్‌లో ఒక్కరోజులోనే 34మంది ఆటో డ్రైవర్లకు కరోనా సోకింది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో మంగళవారం కొత్తగా 3095మంది పాజిటివ్‌ నిర్ధారణ అయింది. 33మంది మరణించారు. ఇదిలా ఉండగా.. దేశంలో యునైటెడ్‌ కింగ్‌డమ్‌(యూకే), బ్రెజిల్‌, దక్షిణాఫ్రికా రకం వైర్‌సలు పెరుగుతున్నాయి. ఈ మూడు రకాలకు చెందిన కేసులు 795కు చేరుకున్నాయని కేంద్రం వెల్లడించింది. ఈ నెల 18నాటికి 400 కేసులుండగా.. ఐదు రోజుల్లోనే ఇవి రెట్టింపయ్యాయి. కొత్తగా పెరిగిన 395 కేసుల్లో 326 పంజాబ్‌లోనే ఉన్నాయి. అయితే.. మహారాష్ట్ర, కేరళ, పంజాబ్‌లలోని కేసుల్లో కొత్త స్ట్రెయిన్‌ను గుర్తించలేదని ప్రభుత్వం తెలిపింది. వ్యాక్సినేషన్‌ ప్రారంభమె ౖనప్పటి నుంచి ఈ నెల 16 వరకు 89మంది మృతి చెందారని, వారి మరణాలకు వ్యాక్సిన్‌ కారణం కాదని పేర్కొంది. యువతను కూడా వ్యాక్సినేషన్‌లో చేర్చాలని పంజాబ్‌ సీఎం అమరీందర్‌ సింగ్‌, ప్రధాని మోదీకి విజ్ఞప్తిచేశారు. కరోనా నేపథ్యంలో ఢిల్లీ, ముంబైలలో హోలీ వేడుకలపై నిషేధం విధించారు. 


రెండో డోసు ఆటోషెడ్యూలింగ్‌ తొలగింపు

కరోనా కేసులు రెట్టింపయ్యే కాలం (డబ్లింగ్‌ టైమ్‌) ఈ నెల 1తో పోలిస్తే మంగళవారం నాటికి గణనీయంగా తగ్గిందని కేంద్రం వెల్లడించింది. 1న 504.4 శాతం ఉన్న డబ్లింగ్‌ టైమ్‌, ప్రస్తుతం 202.3 శాతంగా ఉందని పేర్కొంది. 20 రోజుల వ్యవధిలోనే ఇంతలా తగ్గడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. కో-విన్‌ పోర్టల్‌ రిజిస్ట్రేషన్‌ విధానంలో కేంద్రం మార్పులు చేసింది. వ్యాక్సిన్‌ రెండో డోసులో ఆటో-షెడ్యూలింగ్‌ను తొలగించింది. లబ్ధిదారులు రెండో డోసును తమకు అనుకూలంగా ఉన్న తేదీలో తీసుకోవచ్చని స్పష్టం చేసింది. 

Updated Date - 2021-03-24T08:57:01+05:30 IST