12 ఏళ్ల పిల్లలకూ కరోనా టీకా

ABN , First Publish Date - 2021-08-21T07:09:56+05:30 IST

దేశంలో 12 ఏళ్ల వయసు దాటినవారికి తొలిసారిగా కొవిడ్‌ టీకా అందుబాటులోకి వచ్చింది.

12 ఏళ్ల పిల్లలకూ కరోనా టీకా

  • అందుబాటులోకి జైకొవ్‌-డి.. దేశంలో ప్రథమం
  • జైడస్‌ క్యాడిలా వ్యాక్సిన్‌కు డీసీజీఐ పచ్చజెండా
  • అత్యవసర వినియోగ అనుమతులు మంజూరు
  • ప్రపంచంలో డీఎన్‌ఏ ఆధారిత తొలి కరోనా టీకా
  • సన్నని జెట్‌ ద్వారా చర్మం పైపొరలోకి జై కొవ్‌-డి
  • ఇప్పటిదాకా ఉన్న వ్యాక్సిన్లన్నీ కండరాలకు ఇచ్చేవే
  • 12-17 ఏళ్లవారిపై ట్రయల్స్‌కు జే అండ్‌ జే దరఖాస్తు


న్యూఢిల్లీ, ఆగస్టు 20: దేశంలో 12 ఏళ్ల వయసు దాటినవారికి తొలిసారిగా కొవిడ్‌ టీకా అందుబాటులోకి వచ్చింది. ఇప్పటివరకు 18 ఏళ్లు పైబడిన వారికే వ్యాక్సిన్‌ ఇస్తుండగా.. ఇకపై ఆలోపు వయో విభాగం వారికీ అందనుంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన జైడస్‌ క్యాడిలా సంస్థ రూపొందించిన జై కొవ్‌ -డి టీకాకు డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) శుక్రవారం అత్యవసర వినియోగ అనుమతులు మంజూరు చేసింది. అంతకుముందు నిపుణుల కమిటీ.. డీసీజీఐకి ఈ మేరకు సిఫారసు చేసింది. తమ టీకాకు అనుమతి కోరుతూ జైడస్‌ క్యాడిలా జూలై 1న డీసీజీఐకి దరఖాస్తు చేసుకుంది. వయోజనులతో పాటు, 12 నుంచి 18 ఏళ్ల వయసు వారిపైనా ప్రభావవంతంగా పనిచేస్తుందని అందులో స్పష్టం చేసింది.


కాగా, జై కొవ్‌-డి టీకా అన్ని రకాల వేరియంట్ల నుంచి రక్షణ కల్పిస్తుందని కేంద్రం పేర్కొంది. ఉత్పత్తి సంస్థ జైడస్‌ క్యాడిలా కూడా ఇదే ధీమాను వ్యక్తం చేసింది. ప్రస్తుత.. ప్రత్యేకించి డెల్టా వేరియంట్‌తో పాటు భవిష్యత్‌లో వచ్చే వైరస్‌ మ్యుటేషన్లనూ ఎదుర్కొనగలదని వివరించింది. మరోవైపు 28 వేలమందిపై చేసిన మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌లో జై కొవ్‌-డి టీకా సామర్థ్యం 66.66గా ఉన్నట్లు కేంద్రం తెలిపింది. కేంద్ర బయో టెక్నాలజీ శాఖ, ఐసీఎంఆర్‌ భాగస్వామ్యంతో ‘మిషన్‌ కొవిడ్‌ సురక్ష’ కింద అభివృద్ధి చేసిన జైకొవ్‌-డి టీకాను 2 నుంచి 8 డిగ్రీల ఉష్ణోగ్రతలో నిల్వ చేయొచ్చు. ఏటా 10 కోట్ల నుంచి 12 కోట్ల టీకాలను ఉత్పత్తి చేయగలమని సంస్థ గతంలో తెలిపింది. భారత్‌ బయోటెక్‌ ఉత్పత్తి కొవాగ్జిన్‌ తర్వాత మనదేశంలో తయారై వినియోగ అనుమతులు పొందిన రెండో టీకా జై కొవ్‌-డి. ఈ సందర్భాన్ని అత్యంత ముఖ్యమైన ఘట్టంగా ప్రధాని మోదీ అభివర్ణించారు. 



ప్రత్యేకతల జై కొవ్‌-డి

పిల్లలకు అందుబాటులోకి వచ్చిన తొలి టీకాతో పాటు పలు ప్రత్యేకతలు జై కొవ్‌-డి సొంతం. ఇది ప్రపంచంలోనే తొలి డీఎన్‌ఏ ఆధారిత కరోనా వ్యాక్సిన్‌. అంతేగాక మూడు డోసుల టీకా. ఇప్పటివరకు ఉన్న టీకాలన్నీ సిరంజీతో కండరాలకు ఇచ్చేవి. జై కొవ్‌- డిని మాత్రం సూది లేకుండా.. వెంట్రుక పరిమాణంలోని అత్యంత సన్నటి ‘జెట్‌’ ద్వారా చర్మం పై పొరలోకి ఇంజెక్ట్‌ చేస్తారు. జైకొవ్‌-డితో దేశంలో ఆరో టీకా వినియోగంలోకి రానున్నట్లయింది. ఇప్పటికే సీరం సంస్థ ఉత్పత్తి చేస్తున్న కొవిషీల్డ్‌, భారత్‌ బయోటెక్‌ తయారీ కొవాగ్జిన్‌, రష్యాకు చెందిన స్పుత్నిక్‌, అమెరికాకు చెందిన మోడెర్నా, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ టీకాలకు అనుమతి లభించింది. 




12-17 ఏళ్ల వారిపై ట్రయల్స్‌కు జే అండ్‌జే దరఖాస్తు

భారత్‌లో 12-17 ఏళ్ల మధ్య వారిపై క్లినికల్‌ ట్రయల్స్‌కు అనుమతి కోరుతూ అమెరికా ఫార్మా దిగ్గజం జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌.. సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌కు దరఖాస్తు చేసింది. వైరస్‌ వ్యాప్తి నిరోధానికి పిల్లలు సహా అన్ని వర్గాల వారికి టీకా ఇవ్వడం అత్యవసరమని పేర్కొంది. కాగా, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ సింగిల్‌ డోసు టీకా. హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్‌-ఈ సంస్థ దీనిని భారత్‌లో సరఫరా చేయనుంది. కరోనా తీవ్రంగా ఉన్న రోగులపై ఈ టీకా 85ు ప్రభావవంతంగా పని చేస్తుందని తేలింది. మోడరేట్‌ నుంచి సివియర్‌ కేసులుగా మారకుండా 66ు నిరోధిస్తుంది.


Updated Date - 2021-08-21T07:09:56+05:30 IST