సమన్వయకర్త, సలహాదారు... సీడీఎస్
ABN , First Publish Date - 2021-12-09T07:38:02+05:30 IST
జనరల్ బిపిన్ రావత్... భారతదేశపు మొట్టమొదటి మహా దళాధిపతి (సీడీఎస్... చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్). 2019లో కేంద్ర ప్రభుత్వం ఈ సీడీఎస్ పోస్టును సృష్టించి రావత్‌ను ఆ పదవిలో నియమించింది.

జనరల్ బిపిన్ రావత్... భారతదేశపు మొట్టమొదటి మహా దళాధిపతి (సీడీఎస్... చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్). 2019లో కేంద్ర ప్రభుత్వం ఈ సీడీఎస్ పోస్టును సృష్టించి రావత్‌ను ఆ పదవిలో నియమించింది. అప్పటివరకూ భారత్‌లో ఆర్మీ, వాయుసేన, నౌకాదళాలు వేర్వేరుగానే తమ విధులు నిర్వహించేవి. అవసరమైనప్పుడు ఒకదానితో ఒకటి సమన్వయం చేసుకునేవి. అయితే ఈ సమన్వయం సరిగా లేకపోవడంతో యుద్ధ సమయంలో కొన్ని సమస్యలు తలెత్తేవి. త్రివిధ దళాల మధ్య సమన్వయకర్తగా, ప్రభుత్వానికి ఏకైక సైనిక సలహాదారుగా ఉండేలా సీడీఎస్ పోస్టును సృష్టించాలని 1971 భారత్-పాక్ యుద్ధం తర్వాత అప్పటి ప్రభుత్వం భావించింది. అయితే సీడీఎ్‌సను నియమిస్తే తాను రాజీనామా చేస్తానని అప్పటి వాయుసేనాధిపతి ప్రతా్‌పచంద్ర లాల్ హెచ్చరించడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గినట్లు వార్తలు వచ్చాయి. తిరిగి 1982లో జనరల్ కె.వి.కృష్ణారావు ఈ ప్రతిపాదనను తెరమీదికి తెచ్చినా ప్రభుత్వం అంతగా పట్టించుకోలేదు. 1999 కార్గిల్ యుద్ధంలో ఆర్మీకి, వాయుసేనకు మధ్య సమన్వయ లోపాలకు సంబంధించి మరోసారి లోతైన చర్చ జరిగింది.
అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్‌లలో ఏకైక సైనిక సలహాదారు ఉన్నందువల్ల భారత్‌లో కూడా ఉండాలని కె.సుబ్రహ్మణ్యం నేతృత్వంలోని కార్గిల్ రివ్యూ కమిటీ సిఫారసు చేసింది. మరికొన్ని కమిటీలు కూడా ఇలాంటి సిఫారసులే చేశాయి. ఎట్టకేలకు కార్గిల్ యుద్ధం జరిగిన 20 ఏళ్ల తర్వాత మోదీ ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకుంది. 2019 ఆగస్టు 15న ఎర్రకోటపై నుంచి మోదీ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. సీడీఎస్ విధులు, అధికారాలు నిర్వచించేందుకు జాతీయ భద్రతా సలహాదారు అధ్యక్షతన ఒక కమిటీని నియమించారు. త్రివిధ దళాల కార్యకలాపాలను సమన్వయం చేయడం, ఆయుధ కొనుగోళ్లకు సంబంధించిన ప్రక్రియల్ని అమలు చేయడం, ప్రభుత్వానికి సైనిక సలహాదారుగా వ్యవహరించడం, అవసరమైనప్పుడు థియేటర్ కమాండ్స్‌ను ఏర్పాటు చేయడం, ఆయుధ కొనుగోళ్లలో త్రివిధ దళాల ప్రాథమ్యాలను నిర్ణయించడం వంటివన్నీ సీడీఎస్ విధులుగా ఈ కమిటీ పేర్కొంది. అయితే గతానుభవాల నేపథ్యంలో సీడీఎ్‌సను త్రివిధ దళాధిపతుల కంటే పైస్థాయి అధికారిగా కాకుండా వారితో సమానమైన అధికారిగా నిర్వచించింది. ఆయన సమానులలో ప్రథముడు (జడ్జీలు, చీఫ్ జస్టిస్ మాదిరి)గా ఉంటారని తెలిపింది. సీడీఎస్ పదవీ కాలాన్ని ప్రభుత్వం నిర్దేశించలేదు. అవసరాన్ని బట్టి 65 ఏళ్ల వరకూ పొడిగింపు ఇవ్వవచ్చని తెలిపింది. రావత్ 65 ఏళ్ల వరకూ ఆ పదవిలో ఉండే అవకాశం ఉన్నా.. దురదృష్టవశాత్తూ 63 ఏళ్లకే ఆయన కన్నుమూశారు.
-డిఫెన్స్ ప్రత్యేక ప్రతినిధి, ఆంధ్రజ్యోతి