రాజ్యాంగ సూత్రాలతో పెళ్లి పత్రిక.. నెట్టింట్లో వైరల్

ABN , First Publish Date - 2021-11-27T00:27:50+05:30 IST

గువహాటికి చెందిన అజయ్ శర్మ, పూజా శర్మ అనే జంట తమ వివాహ ఆహ్వాన పత్రికను ఇలా రూపొందించుకున్నారు. వృత్తిరిత్యా న్యాయవాది అయిన అజయ్ శర్మ ఈ కార్డు రూపొందడానికి ప్రధాన కారణమట. అస్సాంకు చెందన ఈ జంట నవంబర్ 28న వివాహ..

రాజ్యాంగ సూత్రాలతో పెళ్లి పత్రిక.. నెట్టింట్లో వైరల్

గువహాటి: ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి ముఖ్యమైన, పెద్ద వేడుక. ఈ వేడుకను తమ తమ అభిరుచులను బట్టి భిన్నంగా చేయాలనుకునే కోరిక చాలా మందిలో ఉంటుంది. వివాహ ఆహ్వాన పత్రిక నుంచే ఈ భిన్నత్వం కనిపిస్తుంటుంది. పెళ్లి కార్యక్రమంలో ముందుగా కనిపించేది పెళ్లి ఆహ్వాన పత్రికే. అందుకే దీనిని వీలైనంత భిన్నంగా, ఆకర్షణీయంగా, కొత్తగా ఉండేలా చూసుకుంటుంటారు. ఇలాంటి ఒక భిన్నమైన పత్రికే ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. భారత రాజ్యాంగ దినమైన ఈరోజున దానికి మరింత ప్రచారం లభించింది. కారణం.. ఆ పత్రికను రాజ్యాంగ సూత్రాలతో రూపొందించడం.


గువహాటికి చెందిన అజయ్ శర్మ, పూజా శర్మ అనే జంట తమ వివాహ ఆహ్వాన పత్రికను ఇలా రూపొందించుకున్నారు. వృత్తిరిత్యా న్యాయవాది అయిన అజయ్ శర్మ ఈ కార్డు రూపొందడానికి ప్రధాన కారణమట. అస్సాంకు చెందన ఈ జంట నవంబర్ 28న వివాహ బంధంతో దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారు. కాగా, ఈ వివాహ ఆహ్వాన పత్రికలో ఆర్టికల్ 21 కల్పించబడ్డ స్వేచ్ఛా హక్కును మొట్టమొదటిసారి నవంబర్ 28న ఉపయోగించుకుంటున్నానని.. కావున ఆర్టికల్ 19 (1) (బీ) ప్రకారం.. (సమావేశమయ్యే హక్కు) తమ వివాహానికి ఆహ్వానితులంతా రావాలని పత్రికలో పేర్కొన్నారు. ఇందులో ప్రధానంగా మరొక ప్రధాన చట్టాన్ని పేర్కొన్నారు. 1955 హిందూ వివాహ చట్టం ప్రకారం.. తామిరువురం పరస్పర అంగీకారంతో ఒకటి కాబోతున్నట్లు పేర్కొన్నారు.


నోటీసుతో ప్రారంభమైన ఈ వివాహ ఆహ్వాన పత్రికలో రెండు చిత్రాలు ఆకట్టుకున్నాయని నెటిజెన్లు అంటున్నారు. ఒకటి కోర్టు హాలులో న్యాయదేవత చేతిలో ఉండే త్రాసు.. రెండోది ప్రేమకు గుర్తుగా రెండు హృదయాలను పెనవేసుకున్న చిత్రం. ఇక చివరిలో రాసిన వ్యాఖ్య మరింత ఆసక్తికరంగా మారింది. ‘‘లాయర్లు పెళ్లి చేసుకుంటే ‘యెస్’ అని కాకుండా ‘నియమ నిబంధనలకు అంగీకరిస్తున్నాను’ అని చెప్పాలి’’ అని పత్రిక చివరిలో రాసుకొచ్చారు.

Updated Date - 2021-11-27T00:27:50+05:30 IST