ప్రధాని కన్నీళ్లతో వాళ్ల బాధ తీరుతుందా?: కాంగ్రెస్ సెటైర్

ABN , First Publish Date - 2021-05-22T02:15:11+05:30 IST

వారణాసిలోని ఫ్రంట్‌లైన్ వర్కర్లతో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ భావోద్వేగానికి గురికావడంపై కాంగ్రెస్ పార్టీ వ్యంగ్యాస్త్రాలు సంధించింది...

ప్రధాని కన్నీళ్లతో వాళ్ల బాధ తీరుతుందా?: కాంగ్రెస్ సెటైర్

న్యూఢిల్లీ: వారణాసిలోని ఫ్రంట్‌లైన్ వర్కర్లతో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ భావోద్వేగానికి గురికావడంపై కాంగ్రెస్ పార్టీ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. ‘‘పశ్చాత్తాపంతో కంటతడి పెట్టినంత మాత్రాన ఆప్తులను కోల్పోయిన వారి బాధ తీరిపోతుందా?’’ అంటూ కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా ప్రశ్నించారు. దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ 30వ వర్థంతి సందర్భంగా ఇవాళ జరిగిన ఓ మీడియా సమావేశంలో ఖేరా మాట్లాడుతూ.. ‘‘అపరాధ భావంతో కంటతడి పెట్టినంత మాత్రాన తమ ఆప్తులను పోగొట్టుకున్న వారి బాధ తీరుతుందా? ప్రధాని కంటతడి కంటే ప్రజల కన్నీటి శోకం మరింత ముఖ్యం..’’ అని పేర్కొన్నారు.


కాగా ప్రధాని మోదీ ఇవాళ తన సొంత నియోజకవర్గం వారణాసిలోని ఫ్రంట్‌లైన్ వర్కర్లతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా మాట్లాడిన విషయం తెలిసిందే. డాక్టర్లు, నర్సులు, ఆరోగ్య సిబ్బంది సహా వివిధ విభాగాలకు చెందిన వారితో మాట్లాడుతూ ఆయన ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. కరోనా మహమ్మారితో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సానుభూతి తెలుపుతూ కంటతడి పెట్టారు. ఫ్రంట్‌లైన్ వర్కర్లు అత్యంత ధైర్యసాహసాలతో, తమ ప్రాణాలను పణంగా పెట్టి కోవిడ్‌పై పోరాటం చేస్తున్నారంటూ ప్రధాని అభినందించారు.

Updated Date - 2021-05-22T02:15:11+05:30 IST