కార్యకర్త చెంప చెళ్లుమనిపించిన డీకే శివకుమార్
ABN , First Publish Date - 2021-07-10T20:59:13+05:30 IST
కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ సహనం కోల్పోయారు. తన భుజం మీద చేయి...
మాండ్య: కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ సహనం కోల్పోయారు. తన భుజం మీద చేయి వేసేందుకు ప్రయత్నించిన ఓ కార్యకర్తపై చేయి చేసుకున్నారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు వైరల్ అవుతోంది. డీకే అహంకార వైఖరిని ప్రదర్శించారంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సీనియర్ రాజకీయ నేత, మాజీ మంత్రి జి.మడెగౌడ ఆరోగ్య పరిస్థితిని వాకబు చేసేందుకు శివకుమార్ మాండ్య వెళ్లినప్పుడు ఈ ఘటన చోటుచేసుకుంది.
డీకేకు అతి సమీపంలో కార్యకర్త నడుస్తున్నట్టు, డీకే భుజం మీద అతను చేయ వేయబోయే ప్రయత్నం చేసినట్టు వీడియోలో కనిపిస్తోంది. ఇది డీకేకు ఆగ్రహం తెప్పించడంతో చెంప చెళ్లుమనిపించారు. ప్రజల ముందు సక్రమంగా మసలుకోవాలని మందలించారు. అయితే, మీడియా కూడా తమ వెంటే ఉందని గ్రహించిన డీకే వెంటనే వారిని వీడియో తొలగించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. సామాజిక దూరం పాటించక పోవడం వల్లే తనకు కోపం వచ్చినట్టు వివరణ ఇచ్చారు. 2018 ఎన్నికల సమయంలోనూ బళ్లారిలో ప్రచారం చేస్తుండగా తనతో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించిన ఒక వ్యక్తి చేతిపై డీకే కొట్టారు. సెల్ఫీ తీయడం సరి కాదని, సహజ ధోరణిలోనే తాను స్పందించానని అప్పట్లో ఆయన చెప్పారు. తన బాధ్యతలను తాను సక్రమంగా నిర్వర్తిస్తూ ప్రెస్ను ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు సెల్ఫీ అంటూ ఎవరైనా ఎందుకు రావాలి?'' అని ప్రశ్నించారు.