అసోంలో బబ్రుద్దీన్ అజ్మల్‌తో పొత్తుకు కాంగ్రెస్ ఉద్వాసన..!

ABN , First Publish Date - 2021-09-02T21:37:30+05:30 IST

అసోం అసెంబ్లీ ఎన్నికల్లో బబ్రుద్దీన్ అజ్మల్‌ ప్రాంతీయ పార్టీతో కలిసి ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఏఐయూడీఎఫ్)గా ఎర్పడి..

అసోంలో బబ్రుద్దీన్ అజ్మల్‌తో పొత్తుకు కాంగ్రెస్ ఉద్వాసన..!

గువాహటి: అసోం అసెంబ్లీ ఎన్నికల్లో బబ్రుద్దీన్ అజ్మల్‌ ప్రాంతీయ పార్టీతో కలిసి ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఏఐయూడీఎఫ్)గా ఎర్పడి ఎన్నికల బరిలో దిగిన కాంగ్రెస్ తాజాగా వెనక్కి తగ్గింది.  బబ్రుద్దీన్ అజ్మల్‌తో పొత్తుకు ఉద్వాసన పలకాలని కాంగ్రెస్ నిర్ణయించినట్టు ఆ పార్టీ వర్గాల సమాచారం. ఇది ఊహాత్మక ఎత్తుగడా, పొరపాటును సరిదిద్దుకునే పనిలో 'గ్రాండ్ ఓల్డ్ పార్టీ' పడిందా అనే విశ్లేషణ ప్రస్తుతం జరుగుతోంది.  అయితే, కాంగ్రెస్‌కు కోపం తెప్పించేలా ఏఐయూడీఎఫ్ నేతల నుంచి బీజేపీ అనుకూల ప్రకటనలు వెలువడమే కాంగ్రెస్ పొత్తు ఉద్వాసన ఆలోచనకు కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


అజ్మల్ సోదరుడు సిరాజుద్దీన్ ఇటీవల అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వాపై పొగడ్తలు గుప్పించారు. బిస్వా శర్మ డైనమిక్ నేత అని, మాదక ద్రవ్యాలపై జరుపుతున్న పోరాటంలో సీఎం నెంబర్ వన్ అని, రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని, ఆయన నాయకత్వంలో అభివృద్ధి కొత్తపుంతలు తొక్కుతోందని సిరాజుద్దీన్ ఇటీవల వరుస స్టేట్‌మెంట్లు ఊదరకొట్టారు. దీనిపై కాంగ్రెస్ కస్సుమంది. వ్యక్తిగత, వ్యాపార ప్రయోజనాలు ఆశించే అజ్మల్ సోదరులు ఇలాంటి పనులకు దిగుతున్నారని, మహాకూటమి భాగస్వామి ఇలా బీజేపీతో రహస్య ఒప్పందం చేసుకోవడం తమకెంత మాత్రం ఆమోదయోగ్యం కాదని అసోం కాంగ్రెస్ ఇన్‌చార్జి జితేంద్ర సింగ్ మండిపడ్డారు.


కాగా, అసోంలోని ఐదు స్థానాలకు త్వరలో ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది. వీటిలో 3 స్థానాలు ఎగువ అసోంలో ఉన్నాయి. ఈ క్రమంలో హిందూ ఓటర్లను ఆకట్టుకోవడం అన్ని పార్టీలకు అనివార్యం కానుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని అజ్మల్‌తో సంబంధాలు తెగతెంపులు చేసుకోవాలని కాంగ్రెస్ ఆలోచనగా తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి 50 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్‌ 29, ఏఐయూడీఎఫ్ 16, బీపీఎఫ్ 4, సీపీఎం ఒక్క సీటు గెలుచుకున్నాయి.

Updated Date - 2021-09-02T21:37:30+05:30 IST