‘టూల్‌కిట్’ ఆరోపణలపై కాంగ్రెస్ ఫైర్... చట్టపరమైన చర్యలకు రెడీ..!

ABN , First Publish Date - 2021-05-19T01:28:12+05:30 IST

కొవిడ్ సంక్షోభం నేపధ్యంలో కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం రోజు రోజుకూ తీవ్రమవుతోంది. తమ ప్రతిష్టను దెబ్బతీసేందుకు...

‘టూల్‌కిట్’ ఆరోపణలపై కాంగ్రెస్ ఫైర్... చట్టపరమైన చర్యలకు రెడీ..!

న్యూఢిల్లీ: కొవిడ్ సంక్షోభం నేపధ్యంలో కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం రోజు రోజుకూ తీవ్రమవుతోంది. తమ ప్రతిష్టను దెబ్బతీసేందుకు బీజేపీ ఓ ‘‘నకిలీ టూ‌ల్‌కిట్’’ను సృష్టించిందంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, ఆ పార్టీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రపై కేసు పెడతామంటూ హెచ్చరించింది. కొవిడ్-19 సంక్షోభంలో తమ ట్విటర్ హ్యాండిల్ ద్వారా సమాజిక కార్యక్రమాలు చేస్తుంటే... బీజేపీ మాత్రం దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందంటూ దుయ్యబట్టింది. ‘‘కొవిడ్-19 వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు బీజేపీ ఓ నకిలీ ‘‘టూల్‌కిట్’’ను తెరమీదికి తీసుకొచ్చింది. దాన్ని ఏఐసీసీ రీసెర్చ్ విభాగానికి అంటగట్టింది. జేపీ నడ్డా, సంబిత్ పాత్రలపై ఫోర్జరీ కేసు పెడతాం..’’ అని కాంగ్రెస్ రీసెర్చ్ విభాగం చీఫ్ రాజీవ్ గౌడ ట్విటర్‌లో పేర్కొన్నారు. కరోనా కోరల్లో చిక్కుకున్న దేశ ప్రజలకు సహాయక కార్యక్రమాలు అందించాల్సింది పోయి బీజేపీ ‘‘సిగ్గులేకుండా’’ ఫోర్జరీలకు తెగబడుతోందంటూ ఆయన మండిపడ్డారు. కరోనా కల్లోలం వేళ దేశాన్ని, ప్రధాని మోదీని అపకీర్తిపాలు చేసేందుకు కాంగ్రెస్ ఓ ‘‘టూల్‌కిట్‌తో’’ ఆ పార్టీ కార్యకర్తలను సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారానికి ఉసిగొల్పుతోందని బీజేపీ ఆరోపించిన విషయం తెలిసిందే. కొవిడ్ బాధితులకు సాయం పేరిట తమకు అనుకూలమైన మీడియా ప్రతినిధులు, వ్యక్తుల ద్వారా పెద్ద ఎత్తున పబ్లిసిటీ చేసుకుంటున్నారంటూ బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర ఆరోపించారు. తమ వద్దనున్న పత్రాల్లో ఇది స్పష్టంగా ఉందన్నారు. అయితే సంబిత్ పాత్ర అలాంటి డాక్యుమెంట్ ఏదీ చూపించలేదనీ... దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియ శ్రీనటే పేర్కొన్నారు. 

Updated Date - 2021-05-19T01:28:12+05:30 IST