పాఠశాలలో CM ఆకస్మిక తనిఖీలు

ABN , First Publish Date - 2021-10-28T16:14:24+05:30 IST

రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ బుధవారం ఉదయం చెంగల్పట్టు జిల్లా కడపాక్కం పి.కృష్ణ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను తనిఖీ నిర్వహించారు. విల్లుపురం జిల్లా ముదలియార్‌కుప్పంలో ‘ఇంటి వద్దకే విద్య’ పథకాన్ని ప్రారంభించే నిమిత్తం

పాఠశాలలో CM ఆకస్మిక తనిఖీలు

చెన్నై(Chennai): రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ బుధవారం ఉదయం చెంగల్పట్టు జిల్లా కడపాక్కం పి.కృష్ణ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను తనిఖీ నిర్వహించారు. విల్లుపురం జిల్లా ముదలియార్‌కుప్పంలో ‘ఇంటి వద్దకే విద్య’ పథకాన్ని ప్రారంభించే నిమిత్తం స్టాలిన్‌ కారులో వెళుతూ మార్గమధ్యంలో కడపాక్కం వద్ద ప్రభుత్వ పాఠశాలకు వెళ్లారు. కలలోనైనా ఊహించని అతిథి కళ్లముందే సాక్షాత్కరించడంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉబ్బితబ్బిబ్బయ్యారు. వారు సంభ్రమాశ్చర్యాల నుంచి తేరుకునే లోపే స్టాలిన్‌ వారివద్దకెళ్లి వారి క్షేమ సమాచారాలను తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి స్టాలిన్‌ వెంట రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి పొన్ముడి, ఇతర అధికారులు కూడా వున్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు జెర్నాస్‌ జాన్‌, ఉపాధ్యాయులు, సిబ్బంది స్టాలిన్‌కు స్వాగతం పలికారు. ఆ తర్వాత స్టాలిన్‌ తరగతి గదులకు వెళ్ళి విద్యార్థులు, పాఠాలు చెబుతున్న ఉపాధ్యాయులను పలకరించారు. విద్యార్థులు చదువులపై శ్రద్ధ చూపడటంతోపాటు కరోనా నిరోధక నిబంధనలను పాటించాలని స్టాలిన్‌ హితవుపలికారు. ప్రతి తరగతి గదిలోనూ పరిశీలించిన తర్వాత ఆయన విద్యార్థులకు మధ్యాహ్న భోజనం తయారు చేస్తున్న ప్రాంతాన్ని తనిఖీ చేశారు. ప్రభుత్వ మెనూ మేరకు సిద్ధం చేశారా లేదా అని పరిశీలించారు. తమ బిడ్డలుగానే భావించి, పిల్లలకు సరిగ్గా ఆహారం వండి వడ్డించాలని ఈ సందర్భంగా అక్కడున్న వంటవారికి సూచించారు. తనిఖీ ముగించుకుని వెళుతున్న ముఖ్యమంత్రిని విద్యార్థులు చుట్టుముట్టి కృతజ్ఞతలు తెలిపారు. 

Updated Date - 2021-10-28T16:14:24+05:30 IST