సరిహద్దు పోరాట యోధులకు నగదు పురస్కారాలు

ABN , First Publish Date - 2021-11-02T15:09:22+05:30 IST

సరిహద్దు పోరాట యోధుల దినం సందర్భంగా సచివాలయంలో సోమవారం ఉదయం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో 110 మంది యోధులకు తలా లక్ష రూపాయల నగదు పురస్కార పథకాన్ని ముఖ్యమంత్రి ఎంకే

సరిహద్దు పోరాట యోధులకు నగదు పురస్కారాలు

                     - అందజేసిన స్టాలిన్‌


చెన్నై(Chennai): సరిహద్దు పోరాట యోధుల దినం సందర్భంగా సచివాలయంలో సోమవారం ఉదయం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో 110 మంది యోధులకు తలా లక్ష రూపాయల నగదు పురస్కార పథకాన్ని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ప్రారంభించారు. 14 మంది సరిహద్దు పోరాట యోధులకు ఆయన రూ.లక్ష నగదు, ప్రశంసాపత్రాలను అందజేశారు. మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి ఆంధ్రప్రదేశ్‌ విడిపోయినప్పుడు తమిళులు అధికంగా నివసించే ప్రాంతాలను రాష్ట్రంలో విలీనం చేసేందుకు, సరిహద్దు ప్రాంతాలను ఖరారు చేసేందుకు పోరాడి జైలు శిక్ష అనుభవించిన త్యాగ ధనులకు ఈ యేడాది నుంచి లక్ష రూపాయల నగదు పురస్కారాలతో సత్కరించనున్నట్లు ముఖ్యమంత్రి స్టాలిన్‌ మూడు రోజుల క్రితం ప్రకటించారు. ఆ మేరకు సచివాలయంలో 14 మందికి నగదు పురస్కారాలతో సత్కరించారు. మిగిలిన సరిహద్దు పోరాట యోధులకు ఆయా జిల్లా కేంద్రాల్లో అధికారులు నగదు పురస్కరాలను అందజేస్తారని స్టాలిన్‌ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తంగం తెన్నరసు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వీఇరై అన్బు, తమిళ భాషాభివృద్ధి, సమాచారశాఖ కార్యదర్శి మహేశన్‌ కాశిరాజన్‌, పౌర సంబంధాల శాఖ సంచాలకులు వీపీ జయశీలన్‌, తమిళభాషాభివృద్ధి శాఖ సంచాలకులు ఎస్‌.శరవణన్‌ తదితరులు పాల్గొన్నారు.


కొత్త పాఠశాల ప్రారంభోత్సవం

స్థానిక కీల్పాక్‌ హైవే సమీపంలోని దేవాదాయ శాఖ పరిధిలోకి చేర్చిన కాంచీపురం అరుళ్‌మిగు ఏకాంబరనాధర్‌ మెట్రిక్యులేషన్‌ పాఠశాలను సచి వాలయం నుంచి ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. కాంచీపురంలోని ఏకాంబరనాధర్‌ ఆలయానికి చెందిన స్థలంలో సీతా కింగ్‌స్టన్‌ మెట్రిక్యులేషన్‌ పాఠశాలను ప్రైవేటు సంస్థ నడిపేది. కాగా పాఠశాలను నిర్వహించలేక సదరు సంస్థ ఆ స్థలాన్ని దేవాదాయ శాఖకు అప్పగించింది. దీంతో ఆ పాఠశాలను ఆ స్థలంలోనే నడిపేందుకు దేవాదాయశాఖ మంత్రి పీకే శేఖర్‌బాబు చర్యలు చేపట్టారు. ఆ మేరకు ఆ పాఠశాల పేరు మార్చారు. దానిని స్టాలిన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆ పాఠశాల విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలను ఆయన పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శేఖర్‌బాబుతోపాటు ఎంపీ దయానిధి మారన్‌, దేవాదాయ శాఖ కమిషనర్‌ గురుబరన్‌, దేవాదాయశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ డాక్టర్‌ పి.చంద్రమోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-02T15:09:22+05:30 IST