ఆదర్శ రాష్ట్రమే ఆశయం

ABN , First Publish Date - 2021-12-31T14:43:53+05:30 IST

తమిళనాడును అన్ని రంగాల్లో అభివృద్ధిపరచి ఆదర్శమైన రాష్ట్రంగా తీర్చిదిద్దటమే తన ప్రధానాశయమని, ఆ ఆశయ సాధనకోసమే నిరంతరం పాటుపడుతున్నామని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ అన్నారు. తంజావూరు రాజా శరభోజి ప్రభుత్వ కళాశాల

ఆదర్శ రాష్ట్రమే ఆశయం

- తంజావూరు సభలో సీఎం స్టాలిన్‌

- కొత్త పథకాలకు శంకుస్థాపన

- రూ.238 కోట్ల సహాయాల పంపిణీ


చెన్నై: తమిళనాడును అన్ని రంగాల్లో అభివృద్ధిపరచి ఆదర్శమైన రాష్ట్రంగా తీర్చిదిద్దటమే తన ప్రధానాశయమని, ఆ ఆశయ సాధనకోసమే నిరంతరం పాటుపడుతున్నామని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ అన్నారు. తంజావూరు రాజా శరభోజి ప్రభుత్వ కళాశాల ప్రాంగణంలో గురువారం ఏర్పాటు చేసిన ప్రత్యేక సభలో ఆయన రూ.894.56 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ప్రభుత్వ పథకాలకు శంకుస్థాపన చేశారు. ఆ జిల్లాలో రూ.98.77 కోట్ల వ్యయంతో పూర్తయిన ప్రభుత్వ పథకాలను కూడా ఆయన ప్రారంభించారు. ఇదే విధంగా 44,525 మంది లబ్ధ్దిదారులకు రూ.238.40 కోట్ల విలువైన సహాయాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ... తంజావూరు అంటేనే కావేరి జలాల వివాదం గుర్తుకు వస్తోందని, ఆ జలాల వివాద పరిష్కారానికి తొట్టతొలుత పాటుపడిందని మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మాత్రమేనని, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేసి ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయించారని చెప్పారు.  తంజావూరు బృహ దీశ్వరాలయం వద్ద ఆ ఆలయాన్ని నిర్మించిన రాజరాజచోళుడి విగ్రహాన్ని ప్రతిష్టించిన ఘనత దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధికే దక్కు తుందన్నారు. కరుణానిధిని రాజకీయ పోరాట యోధునిగా మార్చటంలో తంజావూరు నగరం ప్రధానపాత్ర పోషించిందంటే అతిశయోక్తి కాదని అన్నారు. డీఎంకే అధికారంలోకి వచ్చిన తర్వాతే మెట్టూరు డ్యాం జలాలను నిర్దేశిత తేదీ జూన్‌ 12న విడుదల చేసిందన్నారు.


వేతనాల పెంపు

రాష్ట్ర వినియోగవస్తువుల వాణిజ్య సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు తమ వేతనాలను పెంచాలని ఎప్పటి నుంచో కోరుతున్నారని, ఈ విషయాన్ని మన్నార్‌గుడి శాసనసభ్యుడు టీఆర్‌పీ రాజా తన దృష్టికి తీసుకువచ్చారని, ఆ మేరకు వారి వేతనాలను పెంచుతున్నట్టు ముఖ్యమంత్రి స్టాలిన్‌ సభికుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. రసీదులు రాసే ఉద్యోగులకు రూ.5285లు, సహాయకులు, వాచ్‌మెన్‌లకు తలా రూ.5218లు,  డీఎంకే రూ.3499లను కలిపి ఇచ్చేందుకు అంగీకరిస్తున్నట్టు తెలిపారు. ఈ సంస్థలలో బస్తాలు మోసే కార్మికుల కూలీలను కూడా పెంచుతున్నట్టు ఆయన చెప్పారు. ఆ మేరకు ఇప్పటిదాకా బస్తాకు ఇస్తున్న కూలీని రూ.3.25ల నుంచి రూ.10లకు పెంచుతామని తెలిపారు. ఈ వేతనాల పెంపు, కూలీల పెంపు కారణంగా ప్రభుత్వంపై రూ.83 కోట్ల వ్యయ భారం పడుతుందని ఆయన చెప్పారు.


‘ఒమైక్రాన్‌’ నిరోధానికి చర్యలు

ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే రాష్ట్రంలో ‘ఒమైక్రాన్‌’ వ్యాప్తి తక్కువేనని, అయినా ఆ వైరస్‌  వ్యాప్తి తీవ్రరూప దాల్చకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని స్టాలిన్‌ తెలిపారు. ప్రస్తుతం కరోనా వైరస్‌ వ్యాప్తి బాగా తగ్గుముఖం పట్టినా, ఇటీవల ఆ వైరస్‌ కేసుల సంఖ్య అధికం కావటం ఆందోళన కలిగిస్తోందని చెప్పారు. ఏది ఏమైనప్పటీకీ కరోనా, ఒమైక్రాన్‌ వైరస్‌ల వ్యాప్తి అధికం కాకుండా ఆరోగ్యశాఖ అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారని చెప్పారు.


పథకాల ప్రారంభం

ఈ సభలో ముఖ్యమంత్రి స్టాలిన్‌ తంజావూరు కార్పొరేషన్‌లో అభివృద్ధిపరచిన రాజప్పా ఉద్యానవనం, శరభోజి సంతలో కొత్తగా 309 దుకాణాలు, నాలుగు వెటర్నరీ ఆస్పత్రి భవనాలు తదితరాలను ప్రారంభించారు. ఈ సభలోనే 8416 మందికి ఉచిత ఇంటిపట్టాలు, నెలసరి పింఛను, కారుణ్య ప్రాతిపదికన ఉద్యోగుల వారసులకు నియామక ఉత్తర్వులు, 2922 మంది లబ్ధ్దిదారులకు రేషన్‌ కార్డులు, ఇతర ప్రభుత్వ పథకాల అమలులో భాగంగా లబ్ధ్దిదారులకు ద్విచక్రవాహనాలు, ఆర్థిక సహాయాలను ఆయన అందజేశారు. ఆ కళాశాల ప్రాంగణంలో వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలోనే ఏర్పాటైన వస్తు ప్రదర్శనశాలలను, తంజావూరు సరస్వతీ మహల్‌లోని ప్రాచీన తాళ పత్రాల విభాగాన్ని కూడా ముఖ్యమంత్రి స్టాలిన్‌ తిలకించారు. 


Updated Date - 2021-12-31T14:43:53+05:30 IST