సీఎం సొంత జిల్లాలోనే బీజేపీ ఓటమిపై అధిష్ఠానం గరం

ABN , First Publish Date - 2021-11-04T17:01:33+05:30 IST

శాసనసభకు జరిగిన ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై సొంత జిల్లా హావేరీలో పార్టీ ఓటమిని మూటగట్టుకోవడంపై బీజేపీ అధిష్ఠానం గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. మరో 18 నెలల్లో శాసనసభకు ఎన్నికలు జరగాల్సి

సీఎం సొంత జిల్లాలోనే బీజేపీ ఓటమిపై అధిష్ఠానం గరం

                                - 8న పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ ఆధ్వర్యంలో ఓటమిపై సమీక్ష


బెంగళూరు(Karnataka): శాసనసభకు జరిగిన ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై సొంత జిల్లా హావేరీలో పార్టీ ఓటమిని మూటగట్టుకోవడంపై బీజేపీ అధిష్ఠానం గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. మరో 18 నెలల్లో శాసనసభకు ఎన్నికలు జరగాల్సి వున్న తరుణంలో ఇలాంటి ఫలితాన్ని ఊహించలేదని అధిష్ఠానం పెద్దలు వ్యాఖ్యానించినట్లు సమాచారం. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి అరుణ్‌ సింగ్‌తో పాటు పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు నళిన్‌ కుమార్‌ కటీల్‌ను అధిష్ఠానం పెద్దలు క్లాస్‌ పీకినట్లు తెలుస్తోంది. బొమ్మై నాయకత్వంపై పూర్తిగా విశ్వాసం ఉంచి ఎన్నికలకు వెళితే ఫలితాలు ఎలా ఉంటాయోనని అధిష్ఠానం పెద్దలు ఆందోళన చెందుతున్నారు. దక్షిణాదిన కర్ణాటకలో ఎట్టి పరిస్థితిలోనూ మళ్లీ అధికార పగ్గాలు చేపట్టాల్సిన అవసరం ఉందని భావిస్తున్న అధిష్ఠానం పెద్దలు ఈ నెల 8న ఫలితాలపై సమీక్ష కోసం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి అరుణ్‌ సింగ్‌ను బెంగళూరుకు పంపాలని నిర్ణయించారు. బెంగళూరులో జరిగే ఈ కీలక సమావేశంలో ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మైతో సహా ప్రముఖ నేతలంతా హాజరుకానున్నారు. మాజీ ముఖ్యమంత్రి యడియూరప్పకు కూడా ఈ సమావేశానికి ఆహ్వానం వెళ్లింది. బీజేపీలో పాతనేతలను కాదని అధిష్ఠానం పెద్దలు జనతా పరివార్‌ నుంచి వచ్చిన బొమ్మైకు ముఖ్యమంత్రి పీఠం అప్పగించిన సంగతి తెలిసిందే. బొమ్మై 100 రోజుల పాలన సాఫీగానే సాగినా ఉప ఎన్నికల ఫలితాలు మాత్రం చేదు అనుభవాన్ని మిగిల్చాయి. ఈ ఓటమికి గల కారణాన్ని లోతుగా సమీక్షించుకొని 2023 ఎన్నికలకు పూర్తిస్థాయిలో సన్నద్దం కావాలని అధిష్ఠానం పెద్దలు భావిస్తున్నారు. కాగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు నళిన్‌కుమార్‌ కటీల్‌ స్థానంలో కొత్త నేతకు బాధ్యతలు అప్పగించాలన్న అంశం కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. యడియూరప్ప ఇమేజ్‌ను పూర్తిస్థాయిలో వాడుకోకపోతే రానున్న ఎన్నికల్లో పార్టీకి పరిపూర్ణ విజయం లభించడం కష్టమేనని ఆర్‌ఎస్ఎస్‌ నేతలు సైతం అంగీకరిస్తున్నట్లు తెలిసింది. యడియూరప్ప కుమారుడు విజయేంద్రకు కేబినెట్‌లో చోటు కల్పించడం ద్వారా ఆయన అసంతృప్తిని చల్లార్చి పార్టీని మళ్లీ విజయపథం వైపు నడిపించేందుకు అవసరమైన చర్యలు తీసుకొనే దిశలో బీజేపీ నేతలు పావులు కదుపుతున్నట్లు తెలిసింది. 


Updated Date - 2021-11-04T17:01:33+05:30 IST